మేం బెయిల్ ఇచ్చాం... మీరు మరుసటి రోజే మంత్రి అయ్యారు... ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు

  • సెంథిల్ బాలాజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
  • క్యాష్ ఫర్ జాబ్ స్కాంలో గతంలో సెంథిల్ బాలాజీ అరెస్ట్
  • గత సెప్టెంబరులో బెయిల్
  • వెంటనే మంత్రివర్గంలో చేర్చుకున్న స్టాలిన్ సర్కారు
  • బెయిల్ తీర్పు రీకాల్ చేయాలంటూ పిటిషన్... సుప్రీంలో విచారణ
క్యాష్ ఫర్ జాబ్ స్కాంలో బెయిల్ పొందిన తమిళనాడు నేత సెంథిల్ బాలాజీకి... జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే మంత్రి పదవి లభించడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మేం బెయిల్ ఇచ్చాం... తర్వాత రోజే మీరు మంత్రి అయ్యారు... ఏం జరుగుతోంది? అంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది. 

సెంథిల్ బాలాజీ బెయిల్ తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీ ధర్మాసనం విచారించింది. మేం ఇలా బెయిల్ ఇచ్చామో లేదో, అలా మీరు మంత్రి అయిపోయారు... ఇప్పుడీ కేసులో సాక్షుల పరిస్థితి ఏంటి? మీరు మంత్రి హోదాలో అధికార పీఠంపై ఉన్నందున సాక్షుల్లో ఆందోళన నెలకొనదా? అని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

అయితే సెంథిల్ బాలాజీ బెయిల్ పై పునరాలోచన లేదని, అతడి బెయిల్ రద్దు చేయబోమని స్పష్టం చేసింది. కానీ, సాక్షులు ఆందోళనకు గురవుతారన్న అంశాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని, ఆ అంశం వరకు విచారణ జరుపుతామని తెలిపింది. 

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు చేసిన కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ 2023 జూన్ 14న అరెస్ట్ చేసింది. సెంథిల్ బాలాజీ 2011-15లో అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కాం జరిగింది. సెంథిల్ బాలాజీ 2018లో అన్నాడీఎంకేను వీడి డీఎంకే పార్టీలో చేరారు. స్టాలిన్ ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టారు. 

అయితే, క్యాష్ ఫర్ జాబ్ స్కాంలో ఆయన జైలుకు వెళ్లడంతో మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సెంథిల్ బాలాజీకి గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా, విడుదలైన మరుసటి రోజే ఆయనకు స్టాలిన్ సర్కారు మళ్లీ మంత్రి పదవి ఇచ్చింది.


More Telugu News