పసికూన జపాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా కుర్రాళ్లు

  • యూఏఈలో అండర్-19 ఆసియా కప్
  • తొలి మ్యాచ్ లో పాక్ చేతిలో ఓడిన టీమిండియా
  • నేడు రెండో మ్యాచ్ లో జపాన్ పై 211 పరుగుల తేడాతో విజయభేరి
యూఏఈలో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ టోర్నీలో తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా కుర్రాళ్లు రెండో మ్యాచ్ లో జూలు విదిల్చారు. పసికూన జపాన్ తో నేడు షార్జాలో జరిగిన లీగ్ మ్యాచ్ లో టీమిండియా అండర్-19 జట్టు 211 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జపాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పెద్దగా అనుభవం లేని జపాన్ బౌలర్లలను టీమిండియా కుర్ర బ్యాట్స్ మెన్ ఊచకోత కోశారు. టీమిండియా అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ అమాన్ (122) సెంచరీతో అదరగొట్టగా... ఓపెనర్ ఆయుష్ మాత్రే (57), కేపీ కార్తికేయ (57) ఆండ్రీ సిద్ధార్థ్ (35) రాణించారు. 

13 ఏళ్ల టీనేజి ఓపెనర్ వైభవ్ సూర్యవంశి 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ రాజ్ 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో అజేయంగా 25 పరుగులు చేశాడు. జపాన్ బౌలర్లలో కీఫెర్ లేక్ 2, హ్యూగో కెల్లీ 2, చార్లెస్ హింజ్ 1, ఆరవ్ తివారీ 1 వికెట్ తీశారు. 

అనంతరం, 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన జపాన్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగుల మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఓపెనర్ హ్యూగో కెల్లీ (50), మిడిల్డార్ లో చార్లెస్ హింజ్ (35 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. జపాన్ కెప్టెన్ కోజీ అబే (0) డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో చేతన్ శర్మ 2, హార్దిక్ రాజ్ 2, కేపీ కార్తికేయ 2, యుధాజిత్ గుహా 1 వికెట్ తీశారు.


More Telugu News