తడిచిన ధాన్యం కొనుగోలు చేయండి... ఫెయింజల్ తుపానుపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

  • బంగాళాఖాతంలో ఫెయింజల్ తుపాను
  • తీరం దాటినప్పటికీ ఏపీలో పలు చోట్ల వర్షాలు
  • మరో రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను తీరం దాటినప్పటికీ ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు కూడా పలు చోట్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 

తుపాను అనంతరం వాతావరణ పరిస్థితుల కారణంగా, వర్షాల ప్రభావం ఇంకా తొలగిపోలేదని, మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.  భారీ వర్షాలు కురిసిన జిల్లాల్లో  దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన అంచనాల ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

ఏపీలో 53 మండలాలపై తుపాను ప్రభావం పడిందని, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమీక్ష జరిగింది.


More Telugu News