పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై హర్భజన్ సింగ్ ఫైర్

  • పాక్ జట్టు భారత్ కు రాకుంటే ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్య
  • ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కు అడ్డంకులు కల్పించొద్దని హితవు
  • పాక్ అభిమానులు తనతో స్నేహపూర్వకంగా మెలిగారని గుర్తుచేసుకున్న మాజీ ఆటగాడు
పాకిస్థాన్ జట్టుపై, ఆ దేశ క్రికెట్ బోర్డుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ విషయంలో పాకిస్థాన్ తీరు సరిగాలేదని విమర్శించారు. మొండి పట్టుదలకు పోకుండా టోర్నమెంట్ సజావుగా సాగేలా చూడాలని హితవు పలికారు. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ టోర్నమెంట్ కోసం పాక్ వెళ్లేది లేదని, భారత జట్టు ఆడాల్సిన మ్యాచ్ లను తటస్థ వేదికలపై నిర్వహించాలని ఐసీసీకి బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. టోర్నమెంట్ ను హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహించాలని ప్రతిపాదించింది. తొలుత ఈ ప్రతిపాదనకు ససేమిరా అన్న పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. తాజాగా ఓకే చెప్పింది.

అయితే, భవిష్యత్తులో భారత జట్టుతో ఆడాల్సిన మ్యాచ్ ల కోసం పాక్ జట్టు ఇండియా వెళ్లబోదని మెలిక పెట్టింది. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లను తటస్థ వేదికలపై నిర్వహిస్తామంటూ తమకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదనపై హర్భజన్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్థాన్ లో ఆందోళనల నేపథ్యంలో ఏ జట్టు కూడా అక్కడ పర్యటించేందుకు ఇష్టపడదని వ్యాఖ్యానించారు. పాక్ క్రికెట్ బోర్డు తాజా ప్రతిపాదన సరికాదని, పాక్ జట్టు భారత్ లో పర్యటించకపోతే ఎవరూ పట్టించుకోరని తేల్చిచెప్పారు. ‘మీకు ఇష్టం లేకుంటే రాకండి’ అంటూ పాక్ బోర్డుకు హర్భజన్ స్పష్టం చేశారు. ఆ జట్టు భారత్ కు రాకుంటే తామేమీ బాధపడబోమని చెప్పారు.

పాక్ అభిమానులు స్నేహశీలురు..
పాకిస్థాన్ లోని క్రికెట్ అభిమానులు స్నేహశీలురంటూ హర్భజన్ సింగ్ కితాబునిచ్చారు. గతంలో తను ఆ దేశంలో పర్యటించినపుడు తనకు మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. అక్కడి రెస్టారెంట్లలో భోజనానికి వెళ్లినపుడు తమ వద్ద డబ్బులు తీసుకోలేదని, కొందరైతే శాలువాలు కప్పి అక్కడికక్కడే సన్మానాలు చేశారని చెప్పారు. భారత క్రికెట్ ఆటగాళ్లను ఇప్పుడు వారు ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోవడంపై తనకూ బాధగానే ఉందని భజ్జీ చెప్పుకొచ్చారు. ఇందులో పాక్ అభిమానుల తప్పేమీ లేదని, ఆ దేశంలో పరిస్థితులు చక్కబడేవరకూ భారత జట్టు అక్కడ పర్యటించే అవకాశం లేదని వివరించారు.


More Telugu News