కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్న మెగా హీరో

  • స్వామివారికి వ‌రుణ్ తేజ్ ప్ర‌త్యేక పూజ‌లు 
  • ప్ర‌స్తుతం హ‌నుమాన్ దీక్ష‌లో ఉన్న మెగా ప్రిన్స్‌
  • తొలిసారి హ‌నుమాన్ దీక్ష తీసుకున్న వ‌రుణ్‌
  • దీక్ష‌లో స్వామివారిని ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని వ్యాఖ్య‌
భక్తుల కొంగుబంగారం అయిన‌ కొండగట్టు అంజన్నను మెగా హీరో వ‌రుణ్ తేజ్ మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన వ‌రుణ్‌కు ఆల‌య అర్చ‌కులు తీర్థ‌, ప్ర‌సాదాల‌తో పాటు స్వామివారి చిత్ర‌ప‌టాన్ని అంద‌జేశారు. అంత‌కుముందు ఆయ‌న‌కు ఆల‌య అధికారులు, అర్చ‌కులు పూర్ణకుంభ స్వాగ‌తం పలికారు. 

స్వామివారి ద‌ర్శ‌నానంత‌రం వ‌రుణ్ తేజ్ మాట్లాడారు. కొండగట్టు అంజన్న చాలా మహిమ గ‌ల దేవుడ‌ని అన్నారు. తొలిసారి హ‌నుమాన్ దీక్ష తీసుకుని, స్వామివారిని ద‌ర్శించుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. 

ఇక మెగా ప్రిన్స్‌కు ఇటీవ‌ల వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌ని, గాండీవ‌ధారి అర్జున‌, ఆప‌రేష‌న్ వాలంటైన్‌తో పాటు ఇటీవ‌ల విడుద‌లైన మ‌ట్కా సినిమాలు వ‌రుస‌గా డిజాస్ట‌ర్స్‌గా మిగిలాయి. దాంతో ఇప్పుడు యాక్ష‌న్ సినిమాల‌కు బ్రేక్ ఇచ్చి... హార్ర‌ర్ కామెడీ జోన‌ర్‌లో కొత్త సినిమా చేయబోతున్న‌ట్లు తెలుస్తోంది. 

వ‌రుణ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంతో చేయ‌బోతున్నారు. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించ‌నున్నాయి. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది మార్చిలో సెట్‌పైకి వెళుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమా షూటింగ్‌కు కొంత స‌మ‌యం ఉండ‌టంతో వ‌రుణ్ తేజ్ హ‌నుమాన్ దీక్ష చేప‌ట్టారు.     


More Telugu News