హైదరాబాద్‌ను టోక్యో, న్యూయార్క్ నగరాలతో పోటీ పడేలా చేస్తాం: రేవంత్ రెడ్డి

  • హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్న సీఎం
  • ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మిస్తున్నామని వెల్లడి
  • కాంగ్రెస్ వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం 29 శాతం పెరిగిందన్న సీఎం
లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే హైదరాబాద్ అద్భుత నగరం అవుతుందని, టోక్యో, న్యూయార్క్ నగరాలతో పోటీ పడేలా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రూ.7 వేల కోట్లతో నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రజాపాలన కోసం తెలంగాణ ప్రజలు ఏడాది క్రితం తీర్పునిచ్చారని, తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. మెట్రో రైలును హైదరాబాద్ తీసుకు వచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని వెల్లడించారు. రూ.35 వేల కోట్లతో 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను నిర్మించబోతున్నామన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ అబద్ధాలతో పదేళ్లు గడిపేశారని ఆరోపించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ జాం తదితర సమస్యలతో నివసించడానికి ఇబ్బందికరంగా మారిందన్నారు. అందుకే హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం 29 శాతం పెరిగిందన్నారు. హైడ్రా కేవలం అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చుతోందని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం ముందుకు వెళ్లకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు, హైదరాబాద్‌కు నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు.

మెట్రోకు రూ.35 వేల కోట్లు, రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.35 వేల కోట్లు ఖర్చవుతాయని, కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఎంత మేరకు నిధులు తీసుకువస్తారో చెప్పాలన్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌కు నిధులు తీసుకెళుతుంటే కిషన్ రెడ్డి చూస్తూ ఉన్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేస్తే కాంగ్రెస్‌కు పేరొస్తుందని బీఆర్ఎస్ ఆందోళన చెందుతోందని విమర్శించారు.


More Telugu News