నటి కాదంబరీ జత్వానీ కేసు: విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

  • కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు
  • తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
  • 76 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నటి కాదంబరీ జత్వానీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ గత 76 రోజుల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసాగర్ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. వరుసగా మంగళ, బుధవారాల్లో హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. 

జత్వానీ, పోలీసుల తరపున నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేస్తారని, కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దని న్యాయవాది నర్రా శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. మరో వైపు నిందితుడు తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిందితుడు ఇప్పటికే 76 రోజులుగా జైలులో ఉన్నారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. 

ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ నెల 9న బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించనుంది.   


More Telugu News