ఈ పాలన ఇందిరమ్మ నాటి ఎమర్జెన్సీని తలపిస్తోంది: కవిత

  • సీఐని ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టారన్న కవిత
  • ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరిక
  • అక్రమ కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్
తెలంగాణలో పాలన ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ వెళ్లి వారిని కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు.

పాడి కౌశిక్ రెడ్డి ఏసీపీకి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకొని బంజారాహిల్స్ స్టేషన్‌కు వెళ్లినట్లు చెప్పారు. అక్కడ ఏసీపీ లేకపోవడంతో సీఐని ఫిర్యాదు తీసుకోవాలని కోరారని వెల్లడించారు. సీఐని ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలని అరెస్ట్ చేశారని విమర్శించారు.

ఈ ప్రభుత్వానికి కనీసం ఫిర్యాదు తీసుకునే ధైర్యం లేదన్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు.


More Telugu News