మహీంద్రా కంపెనీ కార్లు కొనాలనుకుంటున్నారా?.. వచ్చే నెలలో పెరగనున్న ధరలు

  • కార్ల రేట్లను 3 శాతం వరకు పెంచనున్నట్టు ప్రకటన
  • అన్ని పొర్ట్‌ఫొలియోల్లోని కార్ల ధరల పెంపు
  • విడిభాగాల ధరల పెరుగుదలతో కస్టమర్లపై భారం మోపక తప్పడంలేదని వెల్లడి
దేశీయంగా అత్యంత ఆదరణ కలిగిన మహీంద్రా అండ్ మహీంద్ర కంపెనీ కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా?. అయితే ఈ డిసెంబర్‌లోనే కొనేయండి. ఎందుకంటే వచ్చే నెల జనవరిలో అన్ని మోడల్ కార్ల రేట్లను పెంచబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం పొద్దుపోయాక ప్రకటన విడుదల చేసింది. కంపెనీకి చెందిన అన్ని పోర్ట్‌ఫోలియోల్లోని కార్ల ధరల పెంపు ఉంటుందని వివరించింది. మూడు శాతం వరకు ధరలు పెంచనున్నట్టు వెల్లడించింది. అయితే వీటిలో ఏయే మోడల్ కార్లపై ఎంత మేర పెంచబోతున్న విషయాన్ని వెల్లడించలేదు. కాగా మహీంద్రా కంపెనీ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, బొలేరో, బొలేరో నియో, ప్రజాదరణ పొందిన ఎక్స్‌యూవీ700, స్కార్పియో-ఎన్, థార్ రాక్స్, ఏకైక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ400 ఈవీ వంటి కార్లను విక్రయిస్తోంది. దేశీయ అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీల్లో మహింద్రా కంపెనీ ఒకటిగా ఉంది.

కాగా ధరల పెంచబోతున్నట్టు మారుతీ సుజుకి, హ్యుందాయ్ మోటార్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ కంపెనీలు కూడా ఇప్పటికే ప్రకటించాయి. జనవరి 1, 2025 నుంచి తమ వాహనాలపై ధరల పెంపు ఉంటుందని తెలిపాయి. ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయని, విడి భాగాల ధరలు కూడా పెరగడంతో ధరల పెంపు తప్పడం లేదని కంపెనీలు వెల్లడించాయి. మహీంద్రా కంపెనీ కూడా ఇవే కారణాలను పేర్కొంది. పెరిగిన ధరల భారాన్ని కొంతమేర వినియోగదారులపై మోపక తప్పడం లేదని వివరించింది. కాగా మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో-ఎన్, ఎక్స్‌యూవీ700, థార్ రాక్స్ కార్లు అత్యధికంగా అమ్ముడుపోతుంటాయి.  నవంబర్‌లో దాదాపు 16 శాతం వృద్ధితో మొత్తం 46,000 కంటే ఎక్కువ ఎస్‌యూవీ కార్లను విక్రయించినట్టు తెలిపింది.


More Telugu News