మంచు మనోజ్, మౌనికపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు

  • మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు!
  • ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్
  • తాజాగా రాచకొండ సీపీకి లేఖ రాసిన మోహన్ బాబు
  • మనోజ్ నుంచి తనకు ముప్పు ఉందని వెల్లడి
  • తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు రచ్చకెక్కాయి. ఇప్పటికే మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... తాజాగా మోహన్ బాబు కూడా పోలీసులను ఆశ్రయించారు. తన చిన్న కుమారుడు మంచు మనోజ్, కోడలు మౌనికపై చర్యలు తీసుకోవాలంటూ మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్ నుంచి తనకు ముప్పు ఉందని పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు మోహన్ బాబు సీపీకి లేఖ రాశారు. 

నాలుగు నెలల క్రితం తన ఇంటి నుంచి వెళ్లిపోయిన మంచు మనోజ్... మళ్లీ తన ఇంటికి వచ్చి, కొందరు సంఘ విద్రోహ శక్తులతో కలిసి అలజడి సృష్టిస్తున్నాడని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం తన నివాసంలో పరిచయం లేని కొత్త వ్యక్తులు ఉండడాన్ని గమనించానని, తాను ఆఫీసుకు వెళ్లగానే, తన ఇంటి వద్ద పరిస్థితి బాగా లేదని సిబ్బంది సమాచారం అందించారని వివరించారు. 

"మనోజ్ కు చెందినవారుగా భావిస్తున్న 30 మంది వ్యక్తులు నా నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నా సిబ్బందిని బెదిరించారు. మంచు మనోజ్, మౌనికల ఆజ్ఞల మేరకే వారు అలా ప్రవర్తించారు. నా ఇంటిని ఆక్రమించుకోవడమే కాకుండా, నా సిబ్బందిని బెదిరించారు. 

వారు నా ఇంటిలోనే తిష్ట వేసి, నా కోసం కాచుకుని ఉన్నట్టు తెలిసింది. అందువల్ల నాకు ముప్పు ఉండడంతో, నా ఇంటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ కుట్రకు కారకులు మనోజ్, మౌనిక. ఇప్పుడు నా వయసు 78 సంవత్సరాలు. ఈ వయసులో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడంతో నాకు తీవ్ర ముప్పు ఉందని భావిస్తున్నాను. నా ఆస్తులు కూడా ప్రమాదంలో పడ్డాయి. 

అందుకే నా కొడుకు మనోజ్, కోడలు మౌనికపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నా నివాసం నుంచి మనోజ్, మౌనికలతో పాటు, ఇతర సంఘ విద్రోహ శక్తులను పంపించివేయండి. ముప్పు ఉన్న దృష్ట్యా నాకు తగిన భద్రత కల్పించండి... ఎలాంటి భయం లేకుండా ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను" అంటూ మోహన్ బాబు తన లేఖలో పేర్కొన్నారు. 

మోహన్ బాబు ఈ లేఖ ప్రతులను పహాడీ షరీఫ్ ఎస్సై, ఏసీపీ... మహేశ్వరం డీసీపీకి కూడా పంపారు.


More Telugu News