పీహెచ్‌డీ చేస్తున్న భారత క్రికెటర్.. ఈ మధ్యే ఐపీఎల్ వేలంలో రూ.23.75 కోట్లకు సేల్

  • ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు
  • క్రికెట్ తర్వాత విద్య అక్కరకొస్తుందన్న క్రికెటర్
  • మధ్యతరగతి కుటుంబంలో క్రికెట్ మాత్రమే ఆడతానంటే తల్లిదండ్రులు ఒప్పుకోరన్న వెంకటేశ్ అయ్యర్
ఇటీవలే జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకున్న స్టార్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తన ఎడ్యుకేషన్‌ను ఇంకా కొనసాగిస్తున్నాడు. పీహెచ్‌డీ (ఫైనాన్స్) కూడా చేస్తున్నట్టు వెల్లడించాడు. కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్న అతడు వార్షిక చెల్లింపు రూ.20 లక్షల నుంచి ఇప్పుడు రూ.23.75 కోట్లకు ఎదిగాడు. అయినప్పటికీ ఎడ్యుకేషన్‌ను మాత్రం ఆపలేదు. ఇటీవల ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తానొక సంప్రదాయక కుటుంబానికి చెందినవాడినని, క్రికెట్‌ను మాత్రమే కొనసాగిస్తానంటే మధ్యతరగతి తల్లిదండ్రులు ఒప్పుకోవడం చాలా కష్టమని వెంకటేశ్ అయ్యర్ వ్యాఖ్యానించాడు. మధ్యతరగతి కుటుంబంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయని, తాను విద్యకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు.

తాను క్రికెట్‌లో బాగా రాణించాలని తల్లిదండ్రులు కోరుకున్నారని అన్నాడు. మధ్యప్రదేశ్ జట్టులోకి కొత్తగా ఏ ఆటగాడైనా వస్తే ‘చదువుతున్నావా? లేదా?’ అని మొదట ప్రశ్నగా అడుగుతుంటానని చెప్పాడు. ‘‘చనిపోయే వరకు విద్య తోడుగా ఉంటుంది. ఒక క్రికెటర్ 60 సంవత్సరాల వరకు ఆడలేడు కదా. క్రికెట్ తర్వాత జీవితం ఉంటుందని అర్థం చేసుకోవాలి’’ అని వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తనకు నేర్పించిన విలువలకు రుణపడి ఉంటానని, చదువుకుంటే తమ రంగాలలో కూడా సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుందని, జీవితంలో బాగా రాణించాలంటే చదువుకోవాలని సూచించాడు. క్రికెట్ తర్వాత విద్య తనకు మరో మార్గం చూపించగలదని, ఎల్లప్పుడూ ఆట గురించే ఆలోచించలేమని, అలా చేస్తే ఒత్తిడి పెరుగుతుందని వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు.


More Telugu News