150 అడుగుల లోతైన బోరుబావిలో పడి మృతి చెందిన ఐదేళ్ల బాలుడు

  • రాజస్థాన్‌లోని దౌసాలో ఘటన
  • మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిన బాలుడు
  • రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
  • చివరికి బాలుడిని బయటకు తీసినా నిలవని ప్రాణాలు
ప్రమాదవశాత్తు 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడుని 56 గంటల తర్వాత బయటకు తీసినప్పటికీ, ప్రాణాలు మాత్రం దక్కలేదు. రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిందీ ఘటన. బోరుబావిలో చిక్కుకుపోయిన బాలుడు ఆర్యన్‌ను రక్షించేందుకు రెండ్రోజులపాటు చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించినప్పటికీ బాలుడి ప్రాణాలు మాత్రం దక్కలేదు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని తాడు సాయంతో బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

మూడు రోజుల క్రితం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆర్యన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. గంట తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. పైపు ద్వారా ఆక్సిజన్‌ను లోపలికి పంపారు. బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు లోపలికి కెమెరాను కూడా పంపారు. ఎస్‌డీఆర్ఎఫ్‌తోపాటు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి.

అదే సమయంలో బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వారు. అయితే, డ్రిల్లింగ్ మెషీన్ పాడవడం, 160 అడుగుల లోతులో నీరు పడే అవకాశం ఉండడంతో బాలుడిని రక్షించేందుకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. ఇంకా తవ్వుకుంటూ పోతే బాలుడిపై మట్టిపెళ్లలు పడే అవకాశం ఉండడంతో చివరికి బాలుడి చుట్టూ తాడు కట్టి జాగ్రత్తగా బయటకు లాగారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు మాత్రం దక్కలేదు. 


More Telugu News