రైతుకు బేడీలు వేసిన ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి: కేటీఆర్

  • రేవంత్ రెడ్డి జైపూర్‌లో విందులు, వినోదాలతో జల్సాలు చేసుకుంటున్నారని విమర్శ
  • గిరిజన రైతులు జైళ్లలో ప్రాణాపాయస్థితిలో ఉన్నారని ఆవేదన
  • రైతుకు ఛాతినొప్పి వస్తే వైద్యం విషయంలో అలసత్వం వహించారని ఆగ్రహం
లగచర్ల గిరిజన రైతుకు బేడీలు వేసిన ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జైపూర్‌లో విందులు, వినోదాలతో జల్సాలు చేసుకుంటూ చిందులు వేస్తున్నారని... ఇక్కడ రైతులకు బేడీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల కేసులో నిందితుడు, రైతు ఈర్యా నాయక్‌ను ఛాతినొప్పి రావడంతో అతనిని సంగారెడ్డి జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో అతని చేతికి బేడీలు వేశారు.

ఈ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన రైతులు జైళ్లలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి నిజంగానే హృదయం ఉంటే, గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే రైతులపై పెట్టిన కేసులను రద్దు చేయాలని ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు బేడీలు వేయడమంటే రేవంత్ రెడ్డి క్రూరమనస్తత్వానికి నిదర్శనమన్నారు. రైతుకు ఛాతినొప్పి వస్తే వైద్య సాయం అందించడంలో అలసత్వం చూపారని మండిపడ్డారు.

ఈర్యా నాయక్‌తో పాటు రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం కూడా బాగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తమ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. గుండెపోటు వచ్చిన రైతును ప్రభుత్వం స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకు రావాల్సి ఉండగా బేడీలు వేసి తీసుకురావడం శోచనీయమన్నారు.


More Telugu News