నటి జత్వానీ కేసు: వారికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు

  • పోలీస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
  • కుట్ర కోణాన్ని వెలికితీయాలంటే నిందితులను అదుపులోకి తీసుకొని విచారించాల్సి ఉందన్న ఏజీ 
  • బాధితురాలి తరపు న్యాయవాదుల వాదనలు కొనసాగింపుకు, పిటిషనర్ల ప్రతివాదనలకు కేసు విచారణ ఈ నెల 19కి వాయిదా
సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని, జత్వానీ అక్రమ అరెస్టు వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీయాలంటే నిందితులను అదుపులోకి తీసుకొని విచారించాల్సి ఉందంటూ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో శుక్రవారం వాదనలు వినిపించారు. తనను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారంటూ జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్‌లు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, విజయవాడ వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం మాజీ సీఐ ఎం. సత్యనారాయణలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ చట్ట నిబంధనలు పాటించాల్సిన పోలీస్ ఉన్నతాధికారులే ఉల్లంఘనలకు పాల్పడినందున వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని, బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. 

జత్వానీ తరపున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభుదాస్, నర్రా శ్రీనివాసరావులు వాదనలు వినిపిస్తూ .. జత్వానీపై తప్పుడు కేసు నమోదు, అరెస్టు వెనుక నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులుది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఆయన మౌఖిక ఆదేశాలతో ముంబయి వెళ్లి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేసి విజయవాడ తీసుకువచ్చారని వివరించారు. జత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నట్లు ప్రాధమిక ఆధారాలున్నాయని తెలిపారు. 

పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, వినోద్ కుమార్, దేశ్‌పాండే, పట్టాభి తదితరులు వాదనలు వినిపించారు. ఫోర్జరీ దస్త్రాలతో భూమిని విక్రయించేందుకు జత్వానీ ప్రయత్నించారని కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఫిబ్రవరిలో కేసు నమోదైందని తెలిపారు. దీనిపై నమోదైన కేసు విచారణ పూర్తి కాకుండానే జత్వానీ ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేయడం చెల్లదని పేర్కొన్నారు. 

ఈ కేసులో ఏ 1 విద్యాసాగర్‌కు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యిందని, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. బాధితురాలు జత్వానీ తరపు న్యాయవాదుల వాదనలు కొనసాగింపుకు, పిటిషనర్ల ప్రతివాదనల కోసం కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ విఆర్‌కే కృపాసాగర్ ప్రకటించారు. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు.    


More Telugu News