విశాఖ రైల్వే స్టేషన్‌లో హైటెన్షన్ విద్యుత్తు వైర్లను ఈడ్చుకెళ్లిన రైలు.. తప్పిన పెను ప్రమాదం

  • తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న రైలు
  • విశాఖ రైల్వే స్టేషన్‌లో ఇంజిన్ మార్పు
  • ఇంజిన్ ముందుకు వెళ్తూ హైటెన్షన్ వైర్లను ఈడ్చుకెళ్లిన వైనం
  • సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఈ తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. స్టేషన్‌కు వచ్చిన ఓ రైలు ఇంజిన్ హైటెన్షన్ విద్యుత్ వైర్లను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. వెంటనే గుర్తించిన సిబ్బంది విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

రైల్వే అధికారుల కథనం ప్రకారం..  తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని పురులియాకు వెళ్తున్న రైలు (22606) ఉదయం 5.20 గంటల సమయంలో విశాఖపట్నం చేరుకుంది. కోల్‌కతా వైపు వెళ్లేందుకు రైలు ఇంజిన్ మారుస్తున్న క్రమంలో తొలగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైన ఉన్న విద్యుత్తు తీగలను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. 

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని చెబుతున్నారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం రంగంలోకి దిగిన సిబ్బంది విద్యుత్తును పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.


More Telugu News