చలికాలంలో బెల్లం, శనగపప్పు కలిపి తింటే... ఎంత లాభమో తెలుసా?

  • శాఖాహారంలో అధిక ప్రొటీన్లకు నిలయం శనగలు
  • వాటిలోని ఫైబర్‌ తోనూ మంచి జీర్ణశక్తికి దోహదం
  • చలికాలంలో రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్న ఆరోగ్య నిపుణులు
శాఖాహారం పరంగా చూస్తే... మన శరీరానికి అధికంగా ప్రోటీన్లు అందేందుకు తోడ్పడేవి శనగలు. ప్రొటీన్లు మాత్రమేకాదు... విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్‌ వంటి వాటికీ ఇవి నిలయం. మరోవైపు బెల్లంతోనూ ఎన్నో ప్రయోజనాలు. అందులోని ఐరన్‌, ఇతర పోషకాలతో లాభాలు. అలాంటిది చలికాలంలో ఈ రెండింటినీ కలిపి రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మంచి జీర్ణశక్తికి తోడ్పాటు...
చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. మన జీర్ణ వ్యవస్థ పనితీరు కాస్త మందగిస్తుంది. ఇలాంటి సమయంలో బెల్లం, వేయించిన శనగలు కలిపి తీసుకుంటే... జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

షుగర్‌ స్థాయుల నియంత్రణ...
బెల్లం, శనగలు కలిపితే... దాని గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. అంటే అవి జీర్ణమై శరీరానికి శక్తి అందడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది రక్తంలో షుగర్‌ స్థాయులు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడుతుంది.

చర్మ ఆరోగ్యానికి తోడ్పాటు...
చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు, తేమ తగ్గే పరిస్థితులలో చర్మం పొడిబారడం, పగుళ్లురావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే బెల్లం, శనగల మిశ్రమంలోని గ్లైకోలిక్‌ యాసిడ్‌... చర్మం పగుళ్లుబారకుండా చూస్తుందని, నిగనిగలాడేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గేందుకు తోడ్పాటు...
రోజూ ఉదయమే కాసింత బెల్లం, శనగల మిశ్రమాన్ని తీసుకుంటే... కడుపు నిండుగా ఉన్న భావన ఉంటుంది. శనగల్లోని అధిక ఫైబర్‌ దీనికి కారణం. దీనితో ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. 

తగినంత శక్తి అందుతుంది...
బెల్లం, శనగల మిశ్రమంతో శరీరానికి అవసరమైన స్థాయిలో శక్తి అందుతుంది. ముఖ్యంగా వ్యాయామం చేసిన తర్వాత తీసుకుంటే... మరింత ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరెన్నో ప్రయోజనాలు కూడా...
  • బెల్లం, శనగలు రెండింటిలోనూ మెగ్నీషియం, పొటాషియం ఉంటాయని.. అవి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
  • ఈ మిశ్రమంతో శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • బెల్లం, శనగల మిశ్రమం తీసుకుంటే మహిళల్లో రుతు సంబంధిత నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఈ మిశ్రమంలోని పోషకాలతో శ్వాస వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని... చలికాలంలో వచ్చే సమస్యలు తగ్గుతాయని పేర్కొంటున్నారు.


More Telugu News