అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థుల దాడి వీడియోను పంచుకున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • హైదరాబాదులో అల్లు అర్జున్ నివాసంపై దాడి
  • రాళ్లు, టమాటాలు విసిరిన ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు
  • ఇంత దారుణమా అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్
  • సిగ్గుపడాలంటూ వ్యాఖ్యలు
హైదరాబాదులో నేడు అల్లు అర్జున్ నివాసాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించడం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

ఒక్కసారిగా దూసుకువచ్చిన ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటి గోడ ఎక్కి రాళ్లు విసిరారు. నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ గేటు ముందు బైఠాయించారు. బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. 

తెలంగాణలో దారుణమైన దృశ్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పన్ను చెల్లింపుదారుడైన అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిందని ఆరోపించారు. 

ఒక జాతీయ స్థాయి హీరోకు వ్యతిరేకంగా రాళ్లు విసరడం, వేధింపులకు పాల్పడడం చూస్తుంటే, ప్రముఖ వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది అని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, సిగ్గుపడాల్సిన విషయం అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.


More Telugu News