చైనా నుంచి యుద్ధ విమానాల కొనుగోలుపై పాక్‌ ఆసక్తి

  • చైనా నుంచి 40 యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్న పాక్‌
  • పాక్‌కు అత్యాధునిక స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌ జే-35 ఏ  
  • అమెరికా, చైనా తరువాత మూడో దేశంగా పాకిస్థాన్‌ 
దాయాది దేశం పాకిస్థాన్‌ను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇందులో భాగంగానే పాక్‌ మిత్రదేశం చైనా నుంచి 40 అత్యాధునిక స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌లను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే దీనిపై బీజింగ్‌తో చర్చలు కూడా ప్రారంభించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

పాకిస్థాన్‌కు అత్యాధునిక స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌ విమానాలను ఇచ్చేందుకు చైనా అంగీకరిస్తే ఆసియా రక్షణ వ్యవస్థలో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయనడంలో సందేహం లేదు. చైనా తరువాత స్టెల్త్‌ జే-35 ఏ మల్టీ రోల్‌ ఫైటర్‌ జెట్‌ స్క్వాడ్రన్‌ కలిగిన దేశంగా పాకిస్థాన్‌ నిలుస్తుంది. అంతేకాదు, బీజింగ్‌ నుంచి ఇలాంటి అత్యాధునిక విమానాలను ఎగుమతి చేయడం కూడా మొదటిసారే అవుతుంది.  

స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌ విమానాల తయారీ రంగంలో చైనా దూసుకుపోతోంది. ఇప్పటికే చైనా జే-20 పేరుతో ఐదోతరం స్టెల్త్‌ విమానాలను తయారు చేసింది. కాగా ఈ కేటగిరీలో ఇది రెండోరకం విమానం. ఈ విమానాలను చైనా పలు సంద‌ర్భాల్లో ప్రదర్శించింది. దీంతో ఈ విమానాలపై పాక్‌ కన్నేసింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఎఫ్‌ 16, ఫ్రెంచ్‌ నుంచి దిగుమతి చేసుకున్న మిరేజ్‌ విమానాల స్థానంలో జే-35 ఏ విమానాలను చేర్చాలని చూస్తోంది. 

చైనా మార్నింగ్‌ పోస్ట్‌ నివేదిక ప్రకారం, ఇప్పటికే ఒప్పందం దాదాపుగా పూర్తయిందని, ఒప్పందం చేసుకున్న రెండేళ్లలోగా ఈ విమానాలను చైనా పాకిస్థాన్‌కు అందించనున్నట్టు కథనాల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ విమానాలను పెద్ద ఎత్తున చైనా ఉత్పత్తి చేస్తోంది. ఇక‌ షెన్‌యాంగ్‌ జే-35 ఏ స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌ ట్విన్‌ ఇంజిన్‌, సింగిల్‌ సీటర్‌ సూపర్‌సోనియ్‌ ఎయిర్‌ సుపీరియారిటీ మల్టీరోల్‌ ఫైటర్‌ జెట్‌ విమానం.  

ఈ విమానం అమెరికా లాక్హీడ్ మార్టిన్ ఎఫ్‌ 35కి దగ్గరగా ఉంటుంది. అయితే, చైనా పలు దేశాల ఇంజనీరింగ్‌ వ్యవస్థలను పరిశీలించి వాటిని కాపీకొట్టి విమానాలను తయారు చేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జే-35 ఏ ఫైటర్‌ జెట్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.


More Telugu News