త్రిపురకు రూ. 200 కోట్ల బకాయి పడిన బంగ్లాదేశ్.. విద్యుత్తు సరఫరా నిలిచిపోనుందా?

  • విద్యుత్తు సరఫరా కోసం త్రిపుర, బంగ్లాదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం
  • రోజూ 60-70 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేస్తున్న త్రిపుర
  • ఇప్పటికే పేరుకుపోయిన రూ. 200 కోట్ల బకాయిలు
  • సరఫరాను ఆపేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న త్రిపుర సీఎం మాణిక్ సాహా
బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లు, అక్కడి హిందూ సమాజంపై అల్లరిమూకల దాడి తదనంతర పరిణామాలతో భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అల్లర్ల నేపథ్యంలో భారత్‌కు వచ్చి తలదాచుకున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ అభ్యర్థించింది.

ఈ నేపథ్యంలో తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమకు రూ. 200 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. 

బంగ్లాదేశ్‌కు 60-70 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసేందుకు త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్, బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌కు త్రిపుర విద్యుత్తును సరఫరా చేస్తోంది. అయితే, ఆ మేరకు డబ్బులు చెల్లించకపోవడంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. దీనికితోడు ఈ బకాయిలకు ప్రతిరోజు మరింత మొత్తం వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మాణిక్ సాహా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ త్వరలోనే బకాయి సొమ్ము చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్తు సరఫరా కొనసాగించాలంటే డబ్బులు చెల్లించకతప్పదని పేర్కొన్నారు. 


More Telugu News