విమర్శల నుంచి తప్పించుకోలేకపోయిన మూడు భారీ సినిమాలు!

  • ఈ ఏడాది జనవరిలో వచ్చిన 'గుంటూరు కారం'
  • ఫ్యామిలీ డ్రామా పండలేదనే టాక్ 
  • 'కల్కి'లో గ్రాఫిక్స్ హడావిడి ఎక్కువైందనే విమర్శలు 
  • 'దేవర'లో ఎమోషన్స్ కనెక్ట్ కాలేదన్న ప్రేక్షకులు  

ఈ ఏడాది జనవరిలో థియేటర్లకు వచ్చిన స్టార్ హీరోల సినిమాలలో మహేశ్ బాబు చేసిన 'గుంటూరు కారం' ఒకటి. హారిక హాసిని బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కథానాయికలుగా శ్రీలీల - మీనాక్షి చౌదరి మెరిశారు. త్రివిక్రమ్ సినిమాలలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అందువలన మహేశ్ బాబు .. రమ్యకృష్ణ .. ప్రకాశ్ రాజ్ కాంబినేషన్లో బలమైన సన్నివేశాలను ప్రేక్షకులు ఊహించుకున్నారు. కానీ వాళ్ల ఊహకు దగ్గరగా ఈ కంటెంట్ వెళ్లలేకపోయిందనే టాక్ వచ్చింది. ఇదే ఏడాది జూన్ నెలలో ప్రభాస్ సినిమా 'కల్కి' థియేటర్లకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ వారు నిర్మించిన సినిమా ఇది. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది. కానీ కథాపరంగా ప్రభాస్ అభిమానులకు సైతం సంతృప్తిని కలిగించలేకపోయింది. ప్రభాస్ లుక్ దగ్గర నుంచి ఆయన పాత్రను డిజైన్ చేయడం వరకూ కామెంట్లు వినిపించాయి. తాము ఆశించిన ఎంటర్టైన్మెంట్ లేదనే టాక్ థియేటర్ల దగ్గర వినిపించింది. ఇక 'దేవర' విషయంలోనూ ఇదే జరిగింది. కొరటాల ఒక సవాల్ గా భావించి తీసిన సినిమా ఇది. భారీ బడ్జెట్ .. తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం .. జాన్వీ కపూర్ తొలి తెలుగు సినిమాగా  అనేక ప్రత్యేకతలతో ఆడియన్స్ ను పలకరించింది. మంచి వసూళ్లను కూడా నమోదు చేసింది. అయితే కథాకథనాల పరంగా కొన్ని విమర్శలను మూటగట్టుకుంది. సన్నివేశాలలో భారీతనమే తప్ప సహజత్వం లేదనీ, లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ వైపు నుంచి కనెక్ట్ కాలేకపోయిందని చెప్పుకున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన ఆర్ధికపరమైన విషయాలను అటుంచితే, తమ హీరోల నుంచి తాము ఆశించినస్థాయి కంటెంట్ రాలేదనే అసంతృప్తి మాత్రం అభిమానుల వైపు నుంచి వినిపించింది. 



More Telugu News