ల్యాండ్ అయిన విమానం ‘వీల్ వెల్‌’లో డెడ్‌‌బాడీ

  • షికాగో నుంచి హవాయిలోని కహులుయ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న విమానం
  • తనిఖీ చేస్తుండగా వీల్ వెల్‌లో డెడ్‌బాడీని గుర్తించిన సిబ్బంది 
  • ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు ప్రకటించిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్
అమెరికాలోని హవాయి రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మౌయిలోని కహులుయ్ ఎయిర్‌పోర్టు‌లో ల్యాండ్ అయిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జెట్‌లైనర్ విమానంలో ఒక మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. విమానం ‘వీల్ వెల్‌’లో డెడ్‌బాడీ కనిపించిందని ఎయిర్‌లైన్స్ బుధవారం ప్రకటించింది. ‘డి యునైటెడ్ ఫ్లైట్ 202’ ఫ్లైట్ మంగళవారం మధ్యాహ్నం షికాగోలోని ఓ'హేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి కహులుయ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిందని వెల్లడించింది.

విమానం ల్యాండింగ్ గేర్‌ ఉండే కంపార్ట్‌మెంట్‌లలో ఒకదాంట్లో మృతదేహం ఉందని, చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానం ‘వీల్ వెల్‌’లోకి వెలుపల నుంచి మాత్రమే ప్రవేశించే అవకాశం ఉంటుందని, మృత్యువాతపడ్డ వ్యక్తి ఎప్పుడు, ఏ విధంగా ప్రవేశించాడో తెలియదని వివరించింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొంది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా స్పందించలేదు.

అత్యంత సంక్లిష్ట ప్రయాణం
విమానం వీల్ వెల్, కార్గో హోల్డ్‌లలో రహస్యంగా ప్రయాణించే వ్యక్తులు బతికి బట్టకట్టడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మైనస్ 50 - 60 సెల్సియస్ డిగ్రీల అత్యంత సంక్లిష్టమైన ఉష్ణోగ్రతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆక్సిజన్ కూడా సరిగా అందదు. వీల్ వెల్‌లో ప్రయాణించేవారి మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. అయితే, అరుదుగా కొందరు ప్రాణాలతో బయటపడుతుంటారు. గతేడాది పారిస్‌లోని అల్జీరియన్ క్యారియర్ విమానం వీల్ వెల్‌ ద్వారా రహస్యంగా ప్రయాణించిన ఓ వ్యక్తి బతికాడు. జనవరి 2022లో ఆఫ్రికా నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌లోని స్కిఫోల్ విమానాశ్రయానికి చేరుకున్న కార్గోలక్స్ ఫ్రైట్ విమానం ద్వారా రహస్య ప్రయాణం చేసిన వ్యక్తి కూడా సజీవంగా ఉన్నాడు.


More Telugu News