గత పాలకులు మూడు ముక్కలాటాడి రాజధానిని నాశనం చేశారు: మంత్రి నారాయణ

  • నరేడ్కో డైరీ 2025ను ఆవిష్కరించిన మంత్రి నారాయణ
  • రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారన్న మంత్రి నారాయణ
  • భవన నిర్మాణాలు, లే అవుట్‌లకు అనుమతులను సులభతరం చేస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్న మంత్రి నారాయణ
గత పాలకులు మూడు ముక్కలాటాడి రాజధానిని సర్వనాశనం చేశారని మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ విమర్శించారు. విజయవాడలో నరేడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్) సెంట్రల్ జోన్ డైరీ 2025ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసునని అన్నారు. 

రెండోసారి సీఎం పురపాలక శాఖ తనకు అప్పగించి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తీసుకొచ్చేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. భవన నిర్మాణాలు, లే అవుట్‌లకు అనుమతులను సులభతరం చేస్తూ ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 500 మీటర్ల కంటే పైన నిర్మాణాలు చేసే భవనాలకు సెల్లార్ అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. 

లే అవుట్‌లలో రోడ్లకు గతంలో ఉన్న 12 మీటర్లను 9 మీటర్లకు తగ్గించామని తెలిపారు. అన్ని అనుమతులు తేలికగా వచ్చేలా సింగిల్ విండో ఆన్‌లైన్ సిస్టమ్ తీసుకొస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరులోగా సింగిల్ విండో విధానం అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. భవన నిర్మాణాలకు 15 రోజుల్లోనే అనుమతులు వచ్చేలా మార్పులు చేస్తున్నామని చెప్పారు. సంక్రాంతి తర్వాత అమరావతిలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే రియల్ ఎస్టేట్ కూడా బాగుండాలని అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణను నరేడ్కో ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.


More Telugu News