మరో విమాన ప్రమాదం.. నార్వేలో రన్‌వే నుంచి జారిపోయిన విమానం.. అందులో 182 మంది!

  • దక్షిణ కొరియా ప్రమాదంలో 179 మంది మృతి
  • నార్వేలో మరో విమాన ప్రమాదం
  • టేకాఫ్ అయిన కాసేపటికే హైడ్రాలిక్ లోపం
  • మరో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంగా రన్‌వేపై జారిపోయిన విమానం
  • ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వైనం
వరుస విమాన ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో 179 మంది మరణించిన వార్తను మరిచిపోకముందే నార్వేలో మరో ప్రమాదం జరిగింది. కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నార్వేలోని ఓస్లో టోర్ప్ శాండెఫ్‌జోర్డ్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత రన్‌వేపై జారిపోయింది. 

ఓస్లో ఎయిర్‌పోర్టు నుంచి ఆమ్‌స్టర్‌డాంకు బయలుదేరిన బోయింగ్ 737-800 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే హైడ్రాలిక్ వ్యవస్థ మొరాయించింది. దీంతో విమానాన్ని 110 కిలోమీటర్ల దూరంలోని శాండెఫ్‌జోర్డ్ విమానాశ్రయానికి మళ్లించాలని పైలట్లు నిర్ణయించారు. అక్కడ విమానం సురక్షితంగానే ల్యాండ్ అయింది. అయితే, ఆ తర్వాత రన్‌వేపై విమానం జారిపోయి పక్కకు దూసుకెళ్లి గడ్డి ఉన్న ప్రదేశంలో నిలిచిపోయింది.

ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 182 మంది ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం ప్రమాదానికి గురైన వెంటనే మొబైల్ మెట్ల ద్వారా ప్రయాణికులను ఖాళీ చేయించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. కాగా, ఈ నెల 25న అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి కాప్సియన్ సముద్రం పశ్చిమతీరంలోని గ్రోజ్నీకి వెళ్తున్న విమానం కుప్పకూలిన ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 


More Telugu News