ఐపీఎల్ 2025కు ముందు ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన ఎంఎస్ ధోనీ

  • మునుపటి స్థాయిలో ఫిట్‌గా లేనని చెప్పిన దిగ్గజ క్రికెటర్
  • క్రీడలు ఆడడానికి అవసరమైన ఫిట్‌నెస్‌తో ఉన్నానంటూ వెల్లడి
  • రూ.4 కోట్ల ధరకు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనీని దక్కించుకున్న సీఎస్కే
భారత దిగ్గజ మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2025లో ఆడనున్న విషయం తెలిసిందే. రూ.4 కోట్ల ధరకు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అతనిని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో మెగా టోర్నీ ఆరంభం కానున్న నేపథ్యంలో తన ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. 

తాను మునుపటి స్థాయిలో ఫిట్‌గా లేనని, అయితే స్పోర్ట్స్ ఆడడానికి అవసరమైన ఫిట్‌నెస్‌తో మాత్రం ఉన్నానని వ్యాఖ్యానించాడు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఫిట్‌‌గా ఉండేందుకు తాను చేయాల్సిన నిర్దిష్టమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించాడు. ‘‘ మేమేమీ ఫాస్ట్ బౌలర్లం కాదు. కాబట్టి, అంత తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు’’ అని ధోనీ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు టైర్ల తయారీ కంపెనీ ‘యూరోగ్రిప్ టైర్స్’ నిర్వహించిన 'ట్రెడ్ టాక్స్' ఎపిసోడ్‌లో ధోనీ మాట్లాడాడు.

తినే ఆహారం, జిమ్‌కి వెళ్లడం ఫిట్‌గా ఉండడానికి దోహదపడతాయని ధోనీ పేర్కొన్నాడు. ఏదో ఒక ఆట ఆడుతుంటే ఫిట్‌గా ఉంటామని, అందుకే సమయం దొరికినప్పుడల్లా విభిన్నమైన క్రీడలను ఆడాలనుకుంటానని చెప్పాడు. టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఆడుతుంటానని వెల్లడించాడు. ఫిట్‌నెస్‌తో కొనసాగడానికి ఇదే ఉత్తమమైన మార్గమని పేర్కొన్నాడు. కాగా, ఎంఎస్ ధోనీ వయసు 43 సంవత్సరాలు దాటిన విషయం తెలిసిందే.


More Telugu News