సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరం.. భార‌త క్రికెట్‌లో అస‌లేం జ‌రుగుతోందని ప్ర‌శ్నించిన‌ సంజయ్ మంజ్రేకర్

  • సిడ్నీ టెస్టుకు దూర‌మైన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌
  • విశ్రాంతి పేరుతో మ్యాచ్‌కు దూరంగా ఉండ‌డం ఏంట‌ని స‌ర్వత్రా ప్ర‌శ్న‌లు
  • టాస్ స‌మ‌యంలో ఈ విష‌య‌మై క‌నీస చ‌ర్చ జ‌ర‌గ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్న‌ సంజయ్ మంజ్రేకర్
  • రోహిత్ గైర్హాజరుపై ర‌విశాస్త్రి అస‌లేం మాట్లాడ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌న్న కామెంటెట‌ర్‌
సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టులో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌ప్పుకోవ‌డం అంద‌రినీ షాక్ కు గురి చేసింది. అది కూడా డూ ఆర్ డై లాంటి మ్యాచ్‌లో ఒక జ‌ట్టు కెప్టెన్ ఇలా విశ్రాంతి పేరుతో మ్యాచ్‌కు దూరంగా ఉండ‌డం ఏంట‌ని స‌ర్వత్రా ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి. అయితే, హిట్‌మ్యాన్ ఇటీవ‌ల పేల‌వమైన ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న  విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అత‌డు మ్యాచ్‌కు దూరమై ఉండొచ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

కాగా, ఒక జ‌ట్టు కెప్టెన్‌, అందులోనూ కీల‌క మ్యాచ్‌లో టీమ్ కు దూరం కావ‌డం ప‌ట్ల టాస్ స‌మ‌యంలో క‌నీసం వివ‌రాలు కూడా అడ‌గ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని కామెంటేట‌ర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. రోహిత్ గైర్హాజరుపై ర‌విశాస్త్రి అస‌లేం మాట్లాడ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని పేర్కొన్నాడు. 

ఒక కెప్టెన్.. సిరీస్‌ను నిర్ణ‌యించే నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్‌లో విశ్రాంతి పేరుతో జ‌ట్టుకు దూరం కావ‌డం ఏంట‌ని, అస‌లు భార‌త క్రికెట్‌లో ఏం జ‌రుగుతోందని మంజ్రేకర్ ప్ర‌శ్నించారు. ఇది ఈ ఏడాది భారత క్రికెట్‌లో అతిపెద్ద సంఘటనలలో ఒకటి అని వ్యాఖ్యానించాడు. అయితే, టాస్ తర్వాత ఈ విషయం గురించి చాలా తక్కువగా మాట్లాడటం ఆసక్తిక‌రంగా మారింద‌ని మంజ్రేకర్ పేర్కొన్నాడు. 

ఇక మ్యాచ్‌లో రోహిత్ బెంచ్‌కే ప‌రిమితం కావ‌డంతో టాస్‌కు వ‌చ్చిన తాత్కాలిక సార‌థి బుమ్రా మాట్లాడుతూ.. "మా కెప్టెన్ ఈ గేమ్‌లో విశ్రాంతి తీసుకోవడంతో జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్టాల్సి వ‌చ్చింది. ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. జట్టుకు ఏది మేలు చేస్తుందో మేము అదే చేస్తాం" అని అన్నాడు.

"రోహిత్ శ‌ర్మ సాదాసీదా క్రికెట‌ర్ కాదు. భారత క్రికెట్‌లో అత‌నో గొప్ప ఆట‌గాడు. ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాలు అందించాడు. అలాంటి ఆట‌గాడు కీల‌క మ్యాచ్ కు ముందు క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవ‌డం శోచ‌నీయం. అస‌లేం జ‌రిగింద‌నేది అభిమానులతో మనం పంచుకోవాలి. టాస్ కోసం జ‌స్ప్రీత్‌ బుమ్రా బయటకు వెళ్లడం చూసినప్పుడు, వారి మనస్సులో మొదటి ఆలోచన రోహిత్ శర్మకు ఏమైంది? అతనే స్వ‌చ్ఛందంగా త‌ప్పుకున్నాడా?  లేదా తొలగించబడ్డాడా? అనేది తెలుసుకోవాల‌ని వారికి ఉంటుంది" అని స్టార్ స్పోర్ట్స్‌తో మంజ్రేకర్ అన్నాడు. 

"అతను విశ్రాంతి తీసుకుంటున్నాడని బుమ్రా చెప్పిన ఆ మాట నేను నమ్ముతున్నాను. మరి అభిమానులు దానిని అంగీకరిస్తారా? రోహిత్ ఈ సిరీస్‌లో మొదటి టెస్టు ఆడ‌లేదు. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు దేశవాళీ క్రికెట్ ఆడలేదు. ఎవరికైనా విశ్రాంతి అవసరమైతే కీల‌క మ్యాచ్ త‌ర్వాత తీసుకుంటారు. అందులోనూ జ‌ట్టు కెప్టెన్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగించింది" అని అన్నారాయన.

"రోహిత్ తన మినహాయింపును రహస్యంగా ఉంచడానికి అతను ఆల్-టైమ్ గ్రేట్ కాదు. ఒకవేళ విరాట్ కోహ్లీ కనుక అలా చేసుంటే నేను అర్థం చేసుకోగలను. కానీ రోహిత్ కేవలం 40 సగటుతో 60కి పైగా టెస్టులు మాత్ర‌మే ఆడాడు. కానీ, అత‌ని గైర్హాజరు వెనుక ఉన్న కార‌ణాన్ని ఎందుకు ర‌హ‌స్యంగా ఉంచుతున్నారో నాకు అర్థం కాలేదు. చాలా మిస్టీరియస్‌గా ఉంది" అని సంజయ్ మంజ్రేకర్ చెప్పినట్లు విజ్డెన్ పేర్కొంది. 


More Telugu News