బిల్డింగ్ రూఫ్‌‌‌టాప్‌పై కూలిన విమానం

  • అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ప్రమాదానికి గురైన చిన్న విమానం
  • ఇద్దరి మృతి.. 18 మందికి తీవ్ర గాయాలు
  • టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే కూలిన ఫ్లైట్
ఇటీవల దక్షిణకొరియా, కజకిస్థాన్‌లలో వరుసగా జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలను మరువక ముందే అమెరికాలో మరో ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఒక చిన్నవిమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఓ భవనం రూఫ్‌టాప్‌పై ఫ్లైట్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫుల్లెర్టోన్‌లోని ఆరెంజ్ కౌంటీ సిటీలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం 2.09 గంటల సమయంలో ఘటన జరిగిందని పోలీసులు వివరించారు.

 ఫుల్లెర్టోన్ మున్సిపల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో, ప్రఖ్యాత డిస్నీల్యాండ్ పార్క్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు. క్షతగాత్రులను తక్షణమే హాస్పిటల్‌కు తరలించినట్టు పేర్కొన్నారు.

విమానం కూలిన చోట భారీగా మంటలు ఎగసిపడ్డాయని, దట్టమైన పొగ ఆవరించిందని, సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆర్పివేశామని పోలీసులు తెలిపారు. భద్రత నిమిత్తం చుట్టుపక్కల భవనాల్లో జనాలను ఖాళీ చేయించామని వివరించారు. విమానం కూలిన భవనం కమర్షియల్ సముదాయమని, బిల్డింగ్ కొంతమేర దెబ్బతిన్నదని పోలీసులు పేర్కొన్నారు.

కాగా, విమానం ఏ రకమైనది?, ప్రమాదానికి గల కారణాలు ఏమిటి? అనే సమాచారం తెలియరాలేదు. విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే కూలిపోయినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్‌అవేర్’ గుర్తించింది.


More Telugu News