రోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకోవాలంటూ ఓ ముఖ్య వ్యక్తి రికమండేషన్.. ఒప్పుకోని కోచ్ గంభీర్!

  • తుది జట్టులో రోహిత్ శర్మకు చోటు ఇచ్చే అవకాశాలను పరిశీలించాలంటూ విజ్ఞప్తి
  • బీసీసీఐలో అపార గౌరవం ఉన్న వ్యక్తి వినతిని తిరస్కరించిన కోచ్ గౌతమ్ గంభీర్
  • జట్టు గెలుపునకు ప్రాధాన్యత ఇచ్చిన హెడ్ కోచ్     
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యంత పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌లో చోటు కోల్పోయాడు. టీమ్ మేనేజ్‌మెంట్ అతడి స్థానంలో యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే, తుది జట్టు కూర్పునకు ముందు ఆసక్తికర పరిణామం జరిగినట్టు తెలుస్తోంది.

కెప్టెన్ రోహిత్‌ శర్మను తుది జట్టులో కొనసాగించాలంటూ బీసీసీఐలో ప్రభావవంతమైన క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ ఒకరు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను కోరినట్టు ‘పీటీఐ’ పేర్కొంది. అయితే, ఈ విజ్ఞప్తిని గంభీర్ తిరస్కరించాడని, డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడానికి అత్యంత కీలకమైన మ్యాచ్ కావడంతో చోటు ఇవ్వడం కష్టమని తేల్చిచెప్పినట్టు పేర్కొంది.

‘‘గంభీర్‌ను సంప్రదించిన సదరు వ్యక్తికి బీసీసీఐలో అపారమైన గౌరవం ఉంది. సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మను ఆడించే అవకాశాలను పరిశీలించాలంటూ గంభీర్‌ను ఆయన కోరారు. కానీ, గంభీర్ తిరస్కరించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలుపునకే గంభీర్ ప్రాధాన్యత ఇచ్చాడు. జట్టులో చోటు దక్కకపోయినప్పటికీ రోహిత్ శర్మ సౌకర్యవంతంగానే కనిపించాడు. వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ఆ తర్వాత గౌతమ్ గంభీర్‌తో బాగానే మాట్లాడాడు’’ అని పీటీఐ పేర్కొంది.

కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ అత్యంత పేలవ ప్రదర్శన చేశాడు. మొత్తం 5 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన అతడు మొత్తం కలిపి 31 పరుగులే సాధించాడు. ఎక్కువ సార్లు సింగిల్ డిజిట్ పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో, హిట్‌మ్యాన్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.  జట్టు గెలుపు అవకాశాలను దెబ్బతీస్తున్నాడంటూ క్రికెట్ అభిమానుల నుంచి మాజీ క్రికెటర్లు వరకు అందరూ విమర్శలు గుప్పించారు. 


More Telugu News