బాలయ్యతో రామ్‌చరణ్.. అన్‌స్టాపబుల్ ప్రీమియర్స్ తేదీ వచ్చేసింది.. వీడియో ఇదిగో

  • జనవరి 8న రాత్రి 7 గంటలకు ప్రీమియర్స్ ప్రారంభం
  • ప్రమోషనల్ వీడియో విడుదల చేసిన  ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’
  • ఆకట్టుకునేలా ఉన్న రామ్‌చరణ్‌, బాలయ్య సందడి
తెలుగు సినీ ప్రియులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘అన్‌స్టాపబుల్’ ఎపిసోడ్ ప్రీమియర్స్ తేదీ ఖరారైంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అలరిస్తున్న ఈ టాక్ షో ఎపిసోడ్-9 ప్రీమియర్స్ జనవరి 8న రాత్రి 7 గంటల నుంచి మొదలుకానుంది. ఈమేరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ఇవాళ (ఆదివారం) ప్రకటించింది. 

మెగా సర్‌ప్రైజ్‌లు, పవర్ ప్యాక్డ్ మూమెంట్స్, గ్లోబల్ స్టార్‌తో మెగా పవర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సిద్ధంగా ఉండాలంటూ ఆహా టీమ్ పేర్కొంది. ఈమేరకు 4.37 నిమిషాల ప్రమోషనల్ వీడియోను కూడా విడుదల చేసింది. అన్‌ప్రిడిక్టబుల్, సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఉన్నాయంటూ వీడియోలో బాలకృష్ణ పేర్కొన్నారు.

‘‘నీకు తెలియని ప్రశ్నలు అడుగుతా. నీ గురించి మీ అమ్మగారిని, నాయనమ్మ గారిని అడిగాం. అవి చెప్పడం నా వల్ల కాదు. ప్రతి పండుగకు ఆమెను కలవడం మిస్ అవ్వవు కదా?’’ వంటి సర్‌ప్రైజింగ్‌ ప్రశ్నలతో రామ్‌చరణ్‌ను బాలయ్య ఆటపట్టించారు. 

రామ్‌చరణ్‌ కూడా సరదాగా, కుటుంబానికి సంబంధించిన అంశాలపై భావోద్వేగంతో కూడిన సమాధానాలు ఇవ్వడం వీడియోలో కనిపించింది. రామ్‌చరణ్‌ బాల్యమిత్రుడు శర్వానంద్ కూడా షోకి వచ్చాడు. అంతేకాదు, రెబల్‌స్టార్ ప్రభాస్‌కు రామ్‌చరణ్ ఫోన్ చేయడం, బాలయ్య ఫోన్ తీసుకొని ఆటపట్టించడం, ఆ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ మూవీ నిర్మాత దిల్ రాజ్ కూడా షోకి రావడం హైలెట్స్‌గా కనిపిస్తున్నాయి. రామ్‌చరణ్‌తో బాలయ్య చేసిన సరదా విశేషాలు చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.


More Telugu News