రేవంత్ రెడ్డి ఆ విషయం మరిచిపోయినట్లున్నారు: మోదీ కులం వ్యాఖ్యలపై బండి సంజయ్

  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ నుండి దారి మళ్లించే ప్రయత్నమని ఆరోపణ
  • అందుకే మోదీ కులంపై చర్చను కోరుతున్నారన్న బండి సంజయ్
  • గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మోదీ ఓబీసీ జాబితాలో ఉన్నారని స్పష్టీకరణ
  • రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ గాంధీ అని మీకు తెలుసా అని ఎద్దేవా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులంపై వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నుండి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ప్రధాన మంత్రి కులం గురించి రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన పరిశోధన పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. 1994లో గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నరేంద్ర మోదీ ఓబీసీ జాబితాలో చేరారని, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి విస్మరించారని వ్యాఖ్యానించారు. 

అంతేకాకుండా, అసలు రాహుల్ గాంధీ కులం ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏ మతానికి చెందిన వారో కూడా చెప్పాలని నిలదీశారు. రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ అని మీకు తెలుసా? అని అడిగారు. హిందూ మతంలో తండ్రి కులం సంక్రమిస్తుందని ఆయన అన్నారు.

ఎవరు చట్టబద్ధంగా మారారనే (కులం లేదా మతం) విషయంపై చర్చించాలనుకుంటే 10 జన్‌పథ్ నుండి ప్రారంభిద్దామని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై దృష్టి మరల్చాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, కానీ సాధ్యం కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన తేల్చి చెప్పారు. మతపరమైన రిజర్వేషన్ల ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన అన్నారు.


More Telugu News