వర్షం కారణంగా ఆస్ట్రేలియా -సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు.. గ్రూప్-బీలో అన్ని జట్లకు సెమీస్ చాన్స్!

  • ఆసక్తికరంగా మారిన సమీకరణలు
  • మూడేసి పాయింట్లతో ఒకటి, రెండు స్థానాల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా
  • ఖాతా తెరవని ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్
  • ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లూ అన్ని జట్లకు కీలకమే
  • ఒక్క మ్యాచ్‌లో ఓడినా సెమీస్ ఆశల గల్లంతు
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బీలో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య నిన్న రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించడంతో రెండు జట్లు మూడేసి పాయింట్లతో గ్రూప్-బీలో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. అయితే, మెరుగైన రన్‌రేట్ కారణంగా సఫారీ జట్టు టాప్ ప్లేస్‌లో ఉంది. ఓటమి పాలైన ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయినప్పటికీ అన్ని జట్లకు సెమీస్ అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాయింట్ల ఖాతా తెరవని ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు కూడా ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి.

దక్షిణాఫ్రికా మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మార్చి 1న బలమైన ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. అప్పుడు గెలిస్తే కనుక 5 పాయింట్లతో సెమీస్‌కు చేరుతుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి వైదొలగుతుంది. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడుతుంది. ఇందులో ఎలాంటి సంచలనాలు నమోదు కాకుండా, ఆస్ట్రేలియా విజయం సాధిస్తే కనుక 5 పాయింట్లతో సెమీస్‌కు వెళుతుంది. లేదంటే సెమీస్ ఆశలు గల్లంతవుతాయి.

మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు జరగనున్న మ్యాచ్‌తోపాటు మార్చి 1న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ విజయం సాధిస్తే కనుక 4 పాయింట్లతో సెమీస్‌ చేరుకుంటుంది. ఒక్కదాంట్లో ఓడినా ఇంటి ముఖం పట్టక తప్పదు. ఇంకోవైపు, ఆఫ్ఘనిస్థాన్‌కు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. ఇకపై ఆడే రెండు మ్యాచుల్లోనూ సంచలనాలు నమోదు చేసి, విజయం సాధిస్తే కనుక సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే, ఇకపై ఢీకొట్టే రెండు జట్లు బలమైనవే కావడంతో ఎంతవరకు అది పోటీనిస్తుందనేది చూడాలి. ఇక, గ్రూప్-ఏలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన న్యూజిలాండ్, భారత జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. మెరుగైన రన్‌రేట్ కారణంగా కివీస్ టాప్ ప్లేస్‌లో ఉంది.


More Telugu News