న్యూజిలాండ్ మ్యాచ్‌కు కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ దూరం..?

  • ఛాంపియ‌న్స్ ట్రోఫీలో వ‌రుస విజ‌యాల‌తో సెమీస్‌కు దూసుకెళ్లిన భార‌త్‌
  • ఆదివారం నాడు కివీస్‌తో ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌
  • ఈ గేమ్‌లో హిట్‌మ్యాన్‌కు విశ్రాంతి ఇచ్చే యోచ‌న‌
  • పాక్‌తో మ్యాచ్‌లో తొడ కండ‌రాల గాయంతో ఇబ్బందిప‌డ్డ రోహిత్‌
  • ఇంకా కోలుకోక‌పోవ‌డంతో అత‌నికి రెస్ట్ ఇవ్వ‌నున్నారంటూ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' క‌థ‌నం
ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌పై విజ‌యాల‌తో సెమీస్‌కు అర్హ‌త సాధించింది. ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడ‌నుంది. అయితే, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తొడ కండ‌రాల గాయంతో ఇబ్బందిప‌డ్డ విష‌యం తెలిసిందే. తొడ కండ‌రాల నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. 

బుధవారం నాడు రెండు రోజుల విరామం తర్వాత భారత్ తిరిగి ప్రాక్టీస్ మొద‌లెట్టింది. అయితే, రోహిత్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయ‌లేద‌ట‌. అతను స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్ ఆధ్వ‌ర్యంలో కేవ‌లం జాగింగ్ మాత్ర‌మే చేసిన‌ట్లు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' క‌థ‌నం పేర్కొంది.

ఈ నేప‌థ్యంలోనే ఆదివారం నాడు (మార్చి 2న) న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' తెలిపింది. మార్చి 4న భారత్ సెమీఫైనల్ ఆడ‌నుంది. అందుకే హిట్‌మ్యాన్ విష‌యం ఎలాంటి రిస్క్ తీసుకోవ‌ద్ద‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం.

రోహిత్ కు ఒక‌వేళ‌ విశ్రాంతి ఇస్తే... న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ జట్టులోకి రిషభ్‌ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవచ్చని తెలుస్తోంది. బుధవారం ఈ ఇద్దరు ఆటగాళ్లు పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ నెట్స్ లో చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేసినట్లు సమాచారం.

ఇక శుభ్‌మన్ గిల్‌తో క‌లిసి ఎవరు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ ను ఓపెన‌ర్‌గా పంపించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లొస్తున్నాయి. 


More Telugu News