టీమిండియా గెలుపు.. కోహ్లీని పొగుడుతూ కాంగ్రెస్ నేత ష‌మా ట్వీట్‌

  • దుబాయ్ వేదిక‌గా ఆసీస్‌, భార‌త్ మ‌ధ్య తొలి సెమీస్
  • ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో మట్టికరిపించిన రోహిత్ సేన‌ 
  • భార‌త్‌ సాధించిన అద్భుత విజ‌యం ప‌ట్ల స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు
  • టీమిండియా విక్ట‌రీపై 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన ష‌మా మ‌హమ్మ‌ద్
దుబాయ్ వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించిన విష‌యం తెలిసిందే. ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో రోహిత్ సేన‌ మట్టికరిపించింది. దీంతో వన్డే ప్ర‌పంచ‌ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి నేటి మ్యాచ్ తో ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఇక భార‌త జ‌ట్టు సాధించిన ఈ అద్భుత విజ‌యం ప‌ట్ల స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. 

అయితే, ఇటీవ‌ల భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌పై బాడీ షేమింగ్ కామెంట్స్‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న‌ కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి ష‌మా మ‌హమ్మ‌ద్ కూడా టీమిండియా విక్ట‌రీపై 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజ‌యం సాధించిన భార‌త జ‌ట్టుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. 

"ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు. కీల‌క మ్యాచ్‌లో 84 పరుగులు సాధించడంతో పాటు ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్లలో వెయ్యి ర‌న్స్‌ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీకి ప్ర‌త్యేక అభినంద‌న‌లు" అని ష‌మా ట్వీట్ చేశారు. 

కాగా, గ‌తంలో కోహ్లీపై కూడా షమా మ‌హమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఒక క్రికెట్ అభిమాని విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ, "భారత ఆటగాళ్ల కంటే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియన్ బ్యాట‌ర్ల ఆట‌ను చూడటం నాకు ఇష్టం. ఇక కోహ్లీని అయితే జ‌నాలు అన‌వ‌స‌రంగా ఆకాశానికి ఎత్తేస్తుంటారు" అంటూ విమర్శించాడు  

దీనికి కోహ్లీ తీవ్రంగా స్పందిస్తూ..."నువ్వు భారత్‌లో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని నా అభిప్రాయం. నీకు నేను న‌చ్చ‌క‌పోవ‌డంపై నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. అయితే, నీకు ఇత‌ర దేశాల వారు న‌చ్చిన‌ప్పుడు నువ్వు ఇక్క‌డ ఉండాల్సిన అవ‌సరం లేదు. అక్క‌డీకే వెళ్లి ఉండండి" అని కోహ్లీ స‌ద‌రు అభిమానికి బ‌దులిచ్చాడు. 

అప్పట్లో కోహ్లీ పోస్టుపై స్పందిస్తూ ష‌మా తీవ్ర విమర్శలు గుప్పించారు. "విరాట్ కోహ్లీ బ్రిటిష్ వారు కనిపెట్టిన ఆట ఆడతాడు. విదేశీ బ్రాండ్లకు ప్ర‌చారం చేస్తూ కోట్లు సంపాదిస్తాడు. ఇటలీలో వివాహం చేసుకున్నాడు. హెర్షెల్ గిబ్స్‌ను తన అభిమాన క్రికెటర్‌గా, ఏంజెలిక్ కెర్బర్‌ను ఉత్తమ టెన్నిస్ క్రీడాకారిణిగా పేర్కొంటాడు. కానీ విదేశీ బ్యాట్స్‌మెన్‌లను ప్రేమించే వారిని ఇండియా విడిచి వెళ్ల‌మని చెబుతాడు" అంటూ ఆమె మండిప‌డ్డారు. ఇప్పుడు మ‌ళ్లీ కోహ్లీని పొడుగుతూ ష‌మా మ‌హ‌మ్మ‌ద్‌ పోస్టు పెట్ట‌డం గ‌మ‌నార్హం. 

ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు లాహోర్ వేదిక‌గా రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన టీమ్‌తో భార‌త జ‌ట్టు మార్చి 9న దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్‌ ఆడుతుంది.



More Telugu News