అది గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా గూస్‌బంప్స్ వ‌స్తాయి... ఆ రాత్రిని ఎప్పటికీ మ‌ర్చిపోలేం: యువ‌రాజ్ సింగ్‌

  • స‌రిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజున రెండోసారి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన భార‌త్‌
  • వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌-2011ను టీమిండియా గెలుపొంద‌డంపై యువీ ఆస‌క్తిక‌ర ట్వీట్‌
  • ఆ రాత్రి వంద కోట్ల మంది కోసం పోరాడామ‌న్న మాజీ క్రికెట‌ర్‌
  • ఇన్నేళ్ల‌యినా ఆ విజ‌యాన్ని గుర్తుచేసుకుంటే ఇప్ప‌టికీ గూస్‌బంప్స్ వ‌స్తాయ‌న్న యువ‌రాజ్‌
స‌రిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా రెండోసారి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచింది. 2011 ఏప్రిల్ 2న ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్లో శ్రీలంక‌ను ఓడించి భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్ గెలుచుకున్న విష‌యం తెలిసిందే. 28 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర దించుతూ ఎంఎస్ ధోనీ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను ముద్దాడింది. కెప్టెన్ ధోనీ సిక్స‌ర్‌తో మ్యాచ్‌ను ముగించ‌డం ఎప్ప‌టికీ అభిమానులు మ‌రిచిపోలేరు. 

ఇలా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌-2011ను టీమిండియా గెలుపొంద‌డంపై మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు. 14 ఏళ్లు గ‌డిచినా ఆ విజ‌యాన్ని గుర్తుచేసుకుంటే ఇప్ప‌టికీ త‌న‌కు గూస్‌బంప్స్ వ‌స్తాయంటూ యువీ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. 

"2011 ఏప్రిల్ 2. ఆ రాత్రి వంద కోట్ల మంది కోసం పోరాడాం. ఆ ప్రపంచ కప్ కేవలం విజయం కాదు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా భార‌త క్రికెట్‌ను త‌న భుజాల‌పై మోసిన లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఈ విజ‌యం అంకితం చేశాం. అత‌డిని చూస్తూ మేము పెరిగాం. ఆ రాత్రి అతనికి జీవితాంతం గుర్తిండిపోయే క్షణాల‌ను ఇవ్వడానికి మేము ఆడాం. 14 ఏళ్లు అయినా ఆ విజ‌యాన్ని గుర్తుచేసుకుంటే ఇప్ప‌టికీ నాకు గూస్‌బంప్స్ వ‌స్తాయి. ఆ రాత్రిని ఎప్పటికీ మ‌ర్చిపోలేం" అని యువ‌రాజ్ సింగ్ త‌న 'ఎక్స్' పోస్టులో రాసుకొచ్చారు. 

ఇక ఈ టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన యువీ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. అలాగే క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూనే అత‌డు 2011 ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌టం గ‌మ‌నార్హం. 




More Telugu News