అతడి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను: రాఘవేంద్రరావు

  • ఎన్టీఆర్ వల్లనే తాను ఈ స్థాయికి ఎదిగినట్లుగా చెప్పుకొచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
  • తన శిష్యుడు రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని వెల్లడి
  • ఎన్టీఆర్‌తో తీసిన అడవి రాముడు సినిమా వల్ల మంచి గుర్తింపు వచ్చిందన్న వైనం
లెజెండరీ సినీ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినీ ఇండస్ట్రీలో దర్శకేంద్రుడుగా పేరు సంపాదించుకున్నారు. అనేక వైవిధ్యభరితమైన సినిమాలను రూపొందించారు. ఎంతోమందిని స్టార్ హీరోలుగా చేయడంతో పాటు, ఇంకెంతో మందికి నటన నేర్పించి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు.

ఆయన వద్ద శిష్యరికం చేసిన వారు సినీ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. రాజమౌళి వంటి  డైరెక్టర్ ను సినీ పరిశ్రమకు అందించిన ఘనత రాఘవేంద్రరావుదే. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడం లేదు కానీ, పలు సినిమాలకు పర్యవేక్షణ చేస్తున్నారు.

తాజాగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో 'కథాసుధ' వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ క్రమంలో సిరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఈ స్థాయికి రావడానికి కారణం ఎన్టీఆర్‌యేనని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌తో తీసిన 'అడవి రాముడు' సినిమా తన సినీ కెరీర్‌ అభివృద్ధికి కారణమైందన్నారు. ఆ సినిమా అప్పట్లో వంద రోజులు ఆడిందన్నారు. ఆ మూవీ షీల్డ్‌ను ఇప్పటికీ తన ఇంట్లో గుర్తుగా పెట్టుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్‌తో తాను అనేక సినిమాలు చేశానని తెలిపారు.

అయితే ఆయన నటన తనకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగించేదన్నారు. ఆయనలాంటి నటుడిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. తన శిష్యుడుగా వచ్చిన రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదగడం తనకు సంతోషాన్ని ఇస్తోందన్నారు. చిత్ర పరిశ్రమకు రాజమౌళిని ఇచ్చాననే ఒక సంతృప్తి తనకు ఉందని, తనకు అది చాలని రాఘవేంద్రరావు అన్నారు. 


More Telugu News