ఈసారి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కాదా...?

  • నాగార్జున స్థానంలో బాలయ్యను హోస్ట్‌గా తీసుకువచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నాలు!  
  • కొన్నిరోజుల్లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ 
  • సినిమా షూటింగ్‌లు, అన్ స్టాపబుల్ షో, రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న బాలయ్య
తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ రియాలిటీ షోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. హీరో నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పటి వరకూ ఎనిమిది సీజన్‌లు పూర్తి చేసుకుంది. త్వరలో తొమ్మిదో సీజన్ మొదలు కానున్నది. ఈ నేపథ్యంలో హోస్ట్ మారే అవకాశం ఉందంటూ టాక్ నడుస్తోంది.

నాగార్జున స్థానంలో మరో నట దిగ్గజం నందమూరి బాలకృష్ణ (బాలయ్య) రానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రతిసారి నాగార్జుననే కొనసాగిస్తే ప్రేక్షకుల నుంచి అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదని యాజమాన్యం భావిస్తోందట. నాగార్జున హోస్ట్‌గా సమర్ధవంతంగా, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ షో నిర్వహిస్తున్నప్పటికీ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నందున బాలయ్యను తీసుకువచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది.

బాలయ్య ఇప్పటికే అన్‌స్టాపబుల్ షో నిర్వహిస్తూ హోస్ట్‌గా రాణిస్తున్నారు. అందుకే బాలయ్యను తీసుకువస్తే టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారని అంటున్నారు. పైగా బాలయ్య లాంటి మాస్ హీరో హోస్ట్ గా నిర్వహిస్తే ఆయన ఫ్యాన్స్ కూడా బిగ్ బాస్‌కు అదనపు ప్రేక్షకులు అవుతారని యాజమాన్యం భావిస్తుందని అంటున్నారు. అందుకే నిర్వాహకులు ఇప్పటికే బాలయ్యతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

మరి కొన్ని రోజుల్లో తొమ్మిదో సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ లోగా బాలయ్యను హోస్ట్‌గా ఒప్పించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని అంటున్నారు. అయితే బాలయ్య ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లతో పూర్తి బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. మరోపక్క అన్‌స్టాపబుల్ షోతో పాటు హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో కొనసాగుతున్నందున బిగ్‌బాస్‌ హోస్ట్‌గా సమయం కేటాయిస్తారా లేదా అనేది వేచి చూడాలి. 

.


More Telugu News