ఏఐతో భ‌విష్య‌త్తులో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు.. ఏఆర్ రెహ‌మాన్ షాకింగ్ కామెంట్స్!

  • ప్ర‌స్తుతం అన్ని రంగాల‌లో భారీగా పెరుగుతున్న‌ ఏఐ వినియోగం   
  • సినిమాల్లోనూ పెరిగిన దీని వినియోగం 
  • ఏఐను ఉప‌యోగించి దివంగ‌త గాయ‌కుల వాయిస్‌తో పాట‌ల‌ను క్రియేట్ చేస్తున్న వైనం
  • ఈ నేప‌థ్యంలో ఏఐ విష‌య‌మై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఏఆర్ రెహ‌మాన్‌
ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం భారీగా పెరుగుతోంది. అన్ని రంగాల‌లో ఏఐ వినియోగం అంత‌కంత‌కూ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. సినిమాల్లోనూ దీని వినియోగం పెరిగింది. ఏఐను ఉప‌యోగించి దివంగ‌త గాయ‌కుల వాయిస్‌తో పాట‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు. 

ఇలా విప‌రీతంగా పెరుగుతున్న ఏఐ వినియోగం విష‌యమై ఆస్కార్ అవార్డు విన్న‌ర్‌, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనిని నియంత్రించ‌క‌పోతే భ‌విష్య‌త్తులో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఏఐ టెక్నాల‌జీ అనేది చాలా శ‌క్తివంత‌మైద‌ని, కానీ దాన్ని అవ‌స‌రానికి మించి వినియోగిస్తే దుష్పరిణామాలు త‌ప్ప‌వు అని అన్నారు.  

రెహ‌మాన్ మాట్లాడుతూ... "ఏఐ వల్ల మంచి, చెడు రెండూ ఉన్నాయి. మంచి కోసం మాత్ర‌మే దీన్ని వినియోగించాలి. కొన్ని రోజులుగా దీని వినియోగం చూస్తుంటే ఆందోళ‌న క‌లుగుతోంది. పెరుగుతున్న టెక్నాల‌జీని ఉప‌యోగించడానికి కూడా కొన్ని ప‌రిమితులు ఉంటాయి. వాటిని అంద‌రూ తెలుసుకోవాలి. కొన్ని చెత్త పాట‌ల‌ను కూడా గొప్ప గాయ‌కులు పాడిన‌ట్లు ఏఐతో క్రియేట్ చేస్తున్నారు. దీనికి ఎవ‌రు బాధ్య‌త తీసుకుంటారో తెలియ‌డం లేదు" అని తెలిపారు. 

కాగా, గ‌తేడాది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన 'లాల్ స‌లామ్' చిత్రంలో దివంగ‌త గాయ‌కులు బంబా బ‌క్యా, షాహుల్ హ‌మీద్‌ల వాయిస్‌ను ఏఐతో రెహ‌మాన్ పునఃసృష్టించిన విష‌యం తెలిసిందే. 


More Telugu News