మీ కలలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా... అందుకు 'వేవ్స్' ఉందిగా!: చిరంజీవి

  • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మే 1 నుంచి 4 వరకు వేవ్స్ సమ్మిట్
  • ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో కార్యక్రమం
  • ప్రపంచస్థాయి ఆడియో విజువల్ దిగ్గజాల రాక
  • ఔత్సాహికులకు పిలుపునిచ్చిన మెగాస్టార్ చిరంజీవి
ప్రపంచ స్థాయి ఆడియో విజువల్ ఎంటర్టయిన్మెంట్ శిఖరాగ్ర కార్యక్రమాన్ని తొలిసారిగా భారత్ లో నిర్వహించనున్నారు. వేవ్స్ (WAVES )పేరిట కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ భారీ ఈవెంట్ లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా పాలుపంచుకుంటున్నారు. చిరంజీవి వేవ్స్ సలహా సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో మే 1 నుంచి 4వ తేదీ వరకు ఈ వేవ్స్ సమ్మిట్ జరగనుంది. 

ఈ కార్యక్రమం గురించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఔత్సాహిక కళాకారులకు చిరంజీవి పిలుపునిచ్చారు. 

"ఒక్కోసారి అనిపిస్తుంటుంటుంది... నేను కాలేజీలో స్టేజి ఎక్కి నాటకం వేయకపోయి ఉంటే ఏమై ఉండేవాడ్నో. మీలో చాలామందికి తెలుసు... ఆంధ్రప్రదేశ్ లోని మొగల్తూరు అనే చిన్న గ్రామం నుంచి పెద్ద ఆశలతో నేను సినీ రంగానికి వచ్చాను. కాలేజీలో వేసిన చిన్న నాటకంతో నా నటనా ప్రస్థానం ప్రారంభమైంది. నటుడ్ని అవ్వాలన్న పెద్ద కలతో ఆ రోజు స్టేజి ఎక్కి నాటకం ద్వారా తొలి అడుగు వేశాను. ఇప్పుడు మీ వంటి ఔత్సాహికులకు వేవ్స్ తొలి వేదిక. వేవ్స్ ద్వారా కలలు సాకారం అవుతాయి... వేవ్స్ ద్వారా అవకాశాలు లభిస్తాయి. మీరు ఊహించకపోవచ్చు... ఇదే మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ కావొచ్చు. 

ఇప్పుడు చెప్పండి... మీరు దిగ్గజాలను  కలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం... http://www.wavesindia.org/ పోర్టల్ లో మీ వివరాలను రిజిస్టర్ చేయించుకోండి... వేవ్స్-2025లో పాల్గొనండి... దీన్ని మీ లాంచ్ ప్యాడ్ లా మలుచుకోండి" అని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు.


More Telugu News