హృదయ విదార‌కం.. ఉగ్ర‌దాడిపై సినీ సెలబ్రెటీల దిగ్భ్రాంతి

  • పహల్గాంలో ఉగ్ర దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ‌ భారత్
  • ఈ ఘటనపై సినీ సెలబ్రెటీల దిగ్భ్రాంతి
  • 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన‌ చిరంజీవి, ఎన్‌టీఆర్, మంచు విష్ణు    
కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా... మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స‌మాచారం. 

ఈ ఘటనపై సినీ సెలబ్రెటీలు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎక్స్ వేదిక‌గా మెగాస్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్‌టీఆర్, మంచు విష్ణు స్పందించారు. ఇది భ‌యంక‌ర‌మైన‌, హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌గా చిరు పేర్కొన్నారు. అలాగే పహల్గాం దాడి బాధితుల గురించి తెలిసి హృదయం ద్రవించిపోయింద‌ని తార‌క్‌ అన్నారు. పహల్గాంలో జరిగిన పిరికి దాడి హృదయ విదారకం అని మంచు విష్ణు తెలిపారు. 

జమ్మూక‌శ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న దారుణమైన దాడి భయంకరమైనది, హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వ‌క‌ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి జ‌రిగిన‌ నష్టాన్ని ఏదీ పూరించలేదు. వారి కోసం నా సంతాపం, ప్రార్థనలు అని చిరంజీవి ట్వీట్ చేశారు.  

“పహల్గాం దాడి బాధితుల గురించి తెలిసి హృదయం ద్రవించిపోయింది. దాడిలో మృతిచెందిన‌ వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. శాంతి, న్యాయం కోసం ప్రార్థిస్తున్నా” అని తార‌క్ రాసుకొచ్చారు. 

"పహల్గాంలో జరిగిన పిరికి దాడి హృదయ విదారకం. త‌మ‌వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి స‌మ‌యంలో మనం మరింత బలంగా నిలబడాలి. ఈ దుఃఖ స‌మ‌యంలో ఐక్యంగా, స్ఫూర్తితో ఉండాలి. ఉగ్రవాదం మనల్ని ఎప్పటికీ విభజించలేదు. జై హింద్" అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.


More Telugu News