ల‌క్నో-ఢిల్లీ మ్యాచ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. సంజీవ్ గోయెంకాను విస్మ‌రించిన కేఎల్ రాహుల్‌.. వీడియో వైర‌ల్‌!

  • నిన్న ల‌క్నో వేదిక‌గా డీసీ, ఎల్ఎస్‌జీ మ్యాచ్‌
  • హాఫ్ సెంచ‌రీతో ఢిల్లీ విజ‌యంలో కేఎల్ రాహుల్ కీరోల్‌
  • మ్యాచ్ అనంత‌రం ఆట‌గాళ్ల‌తో క‌ర‌చాల‌నం చేసే స‌మ‌యంలో ఆసక్తిక‌ర ప‌రిణామం
  • సంజీవ్ గోయెంకాకు షేక్‌హ్యాండిచ్చినా మాట్లాడేందుకు ఆస‌క్తి చూప‌ని కేఎల్‌
మంగ‌ళ‌వారం ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మ్యాచ్‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ‌త సీజ‌న్‌లో ల‌క్నోకు సార‌థిగా న‌డిపించిన కేఎల్ రాహుల్‌... ఈసారి ఢిల్లీకి మారాడు. గ‌త సీజ‌న్‌లో మైదానంలోనే ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గోయెంకా... రాహుల్‌పై నోరుపారేసుకోవ‌డం, దాని తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. అయితే, నిన్న‌టి మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచ‌రీ (57)తో డీసీ విజ‌యంలో కేఎల్‌ కీల‌క పాత్ర పోషించాడు.   

ఇక‌, మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ప్లేయ‌ర్ల‌తో క‌ర‌చాల‌నం చేస్తున్న స‌మ‌యంలో సంజీవ్ గోయెంకా, ఆయ‌న కుమారుడు శశ్వాంత్ గోయెంకా కూడా మైదానంలోనే ఉన్నారు. ఆ ఇద్ద‌రితో క‌ర‌చాల‌నం చేసి, రాహుల్ ముందుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా... సంజీవ్ గోయెంకా అతడిని ఆపేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, కేఎల్ మాత్రం వారితో మాట్లాడేందుకు ఆస‌క్తి చూపించ‌లేదు. వారిని విస్మ‌రిస్తూ ముందుకెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.  

కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ను మ‌ట్టిక‌రిపించిన విష‌యం తెలిసిందే. ల‌క్నో నిర్దేశించిన‌ 160 పరుగుల లక్ష్యాన్ని డీసీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజ‌యంతో ఢిల్లీ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన ఆ జ‌ట్టు.. ఆరింటిలో విజ‌యం సాధించ‌డం విశేషం. 


More Telugu News