సూర్య‌వంశీ సెంచ‌రీ.. త‌న గాయాన్ని మ‌రిచి ద్రవిడ్ స్టాండింగ్ ఒవేషన్.. వైర‌ల్ వీడియో!

  • గుజ‌రాత్‌పై ఆర్ఆర్ బ్యాట‌ర్ సూర్య‌వంశీ స్వైర విహారం
  • కేవ‌లం 35 బంతుల్లోనే శ‌త‌కం బాదిన వైనం
  • సూర్య‌వంశీ శ‌త‌కం పూర్త‌యిన వెంట‌నే ప్రేక్ష‌కుల స్టాండింగ్ ఒవేష‌న్ 
  • గాయాన్ని మ‌రిచి... వైభ‌వ్ సెంచ‌రీ సంబ‌రాల్లో మునిగిపోయిన కోచ్ ద్ర‌విడ్‌ 
సోమవారం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాటింగ్ ఎంతంటి విధ్వంస‌క‌రంగా సాగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 14 ఏళ్ల ఈ చిచ్చ‌ర‌పిడుగు ఎంతో అనుభ‌వం ఉన్న ఇషాంత్ శ‌ర్మ‌తో పాటు గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. 

త‌న‌పై యాజ‌మాన్యం ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ తుపాన్ ఇన్నింగ్స్ తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును వ‌ణికించాడు. ఆకాశ‌మే హద్దుగా చెల‌రేగిన ఈ యువ సంచ‌ల‌నం 35 బంతుల్లోనే సూప‌ర్ సెంచ‌రీ బాదాడు. ఇక వైభ‌వ్ శత‌కం పూర్తి చేసిన వెంట‌నే స్టేడియంలో ఉన్న‌వారంద‌రూ స్టాండింగ్ ఒవేష‌న్ ఇవ్వ‌డం విశేషం. 

ఈ క్ర‌మంలో ఆర్ఆర్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా త‌న గాయాన్ని మ‌రిచిపోయి వీల్‌చైర్‌ నుంచి నిల‌బ‌డి, వైభ‌వ్‌ను అభినందించాడు. త‌న‌కు గాయ‌మైంద‌నే విష‌యాన్ని మ‌రిచి ఆట‌గాళ్ల‌తో క‌లిసి స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

ఇక‌, ఈ సీజన్‌లో ఎక్కువ భాగం ద్రవిడ్ వీల్‌చైర్‌లోనే క‌నిపిస్తున్న విష‌యం తెలిసిందే. కానీ ఐపీఎల్‌లో వైభ‌వ్‌ తన తొలి సెంచరీ న‌మోదు చేయ‌డంతో ఈ భారత దిగ్గజం.. త‌న‌ను తాను బ్యాలెన్స్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నప్పటికీ, లేచి నిలబడి యువ ఆట‌గాడిని అభినందించాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజ‌న్‌కు కొన్నిరోజుల ముందు క్రికెట్ ఆడుతూ ద్ర‌విడ్ గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. దాంతో వీల్‌చైర్‌లోనే ఆర్ఆర్ మ్యాచ్‌ల‌కు హాజ‌ర‌వుతున్నాడు.  


More Telugu News