ఒడిశాలోని ‘కిట్’లో నేపాలీ యువతి అనుమానాస్పద మృతి.. 90 రోజుల్లో రెండో ఘటన

  • భువనేశ్వర్‌లోని కిట్ యూనివర్సిటీ హాస్టల్‌లో నేపాల్ విద్యార్థిని మృతి 
  • గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో మృతదేహం లభ్యం
  • 3 నెలల క్రితం ఇదే యూనివర్సిటీలో నేపాలీ యువతి ఆత్మహత్య
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ప్రతిష్ఠాత్మక కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో మరో విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీకి చెందిన బాలికల హాస్టల్‌ గదిలో నేపాల్‌ విద్యార్థిని గురువారం సాయంత్రం విగతజీవిగా కనిపించింది. మూడు నెలల వ్యవధిలో ఇదే క్యాంపస్‌లో నేపాల్ విద్యార్థిని మృతి చెందడం ఇది రెండోసారి కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు కంప్యూటర్ సైన్స్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె స్వస్థలం నేపాల్ రాజధాని కఠ్మాండుకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్‌గంజ్. గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలికల హాస్టల్‌లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే యూనివర్సిటీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. భువనేశ్వర్-కటక్ పోలీస్ కమిషనర్ సురేష్ దేవ్‌దత్తా సింగ్ మాట్లాడుతూ, ‘కిట్ యూనివర్సిటీలో నేపాల్‌కు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు సమాచారం అందింది. మేం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాం. శాస్త్రీయ బృందం వచ్చి అవసరమైన ఆధారాలు సేకరించింది. సమగ్ర విచారణ జరుపుతాం. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించాం’ అని తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల స్పష్టమైన కారణాలు తెలుస్తాయని, ప్రస్తుతానికి దీనిని అనుమానాస్పద మృతి (ఆత్మహత్య కోణంలో)గా పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మూడు నెలల్లో రెండో ఘటన
గత మూడు నెలల్లో కిట్ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని మరణించడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 16న బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లమ్సాల్ అనే నేపాల్ విద్యార్థిని కూడా ఇదే విధంగా హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించింది. ఆ సమయంలో సహచర విద్యార్థి ఒకరు తనను లైంగికంగా వేధించారని యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీస్ (ఐఆర్‌వో) కు ఫిర్యాదు చేసినట్టు తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే, యూనివర్సిటీ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోలేదని, ఇది ‘తీవ్ర నిర్లక్ష్యం’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) వ్యాఖ్యానించింది. విద్యార్థి సంఘాలు, పౌర సమాజం తీవ్రంగా స్పందించడంతో, ఆమె మరణించిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేశారు. బీజేడీ నేత, మాజీ ఎంపీ అచ్యుత సమంత స్థాపించి, నిర్వహిస్తున్న ఈ యూనివర్సిటీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

విద్యార్థిని మరణం కలచివేసింది
నేపాల్ విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బా ఈ ఘటనపై స్పందించారు. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు భారత ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం, ఢిల్లీలోని నేపాల్ రాయబార కార్యాలయ ఉన్నతాధికారుల ద్వారా దౌత్యపరమైన చర్యలు ప్రారంభించినట్టు సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. ‘ప్రిసా సాహ్ మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. (ప్రిసా సాహ్ అనే పేరు నేపాల్ మంత్రి ట్వీట్‌లో ఉంది, అధికారిక ప్రకటనల్లో ఇంకా నిర్ధారణ కాలేదు).


More Telugu News