ప్ర‌ధాని మోదీ అమృత హ‌స్తాల‌తో అమ‌రావ‌తి ప‌నుల పునఃప్రారంభం: డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌

     
ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. ఆశగా, ఆకాంక్షగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకకు అంతా సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం ప‌నులు మొదలు కానున్నాయి. ఈ ప‌నుల‌ను ప్రారంభించ‌డానికి వ‌స్తున్న ప్ర‌ధాని మోదీకి హృద‌య‌పూర్వ‌కంగా స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ఈ మేర‌కు జ‌న‌సేనాని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్ట్ పెట్టారు.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు ఈరోజు రాష్ట్రానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం... సుస్వాగ‌తం. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పున‌ర్నిర్మాణాన్ని మీ అమృత హస్తాలతో ప్రారంభిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని ప‌వ‌న్‌ ట్వీట్ చేశారు.

అమరావతిలో నో ఫ్లై జోన్
ప్రధాని మోదీ అమరావతి పర్యటనలో సభ జరిగే ప్రాంతానికి 5 కిలోమీట‌ర్ల‌ పరిధిని నోఫ్లై జోన్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్‌ ఎగురవేయడానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కలా ఇవే నిబంధనలు అమలవుతాయి. పహల్గామ్ లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.


More Telugu News