లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ... తరలివెళ్లిన మెగా ఫ్యామిలీ.. ఫొటో ఇదిగో!

  • లండన్‌ మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం
  • విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం లండన్ ప్రయాణం
  • భార్య ఉపాసన, కుమార్తె క్లీంకారతో చరణ్
  • చిరంజీవి, సురేఖ కూడా పయనం
  • గ్లోబల్ స్టార్‌గా చరణ్‌కు దక్కిన మరో గుర్తింపు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు. లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌కు బయలుదేరి వెళ్లారు.

వివరాల్లోకి వెళితే, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలకు లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎంతో ప్రసిద్ధి. ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియంలో ఇప్పుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా కొలువుదీరనుంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రామ్ చరణ్, ఆయన అర్ధాంగి ఉపాసన కామినేని కొణిదెల, గారాల పట్టి క్లీంకార కొణిదెల... మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతలు లండన్ పయనమయ్యారు.

రామ్ చరణ్ 'RRR' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం తెలుగు సినీ పరిశ్రమకు, ఆయన అభిమానులకు గర్వకారణంగా మారింది. ఈ విగ్రహం ఎలా ఉండబోతుందోనని, ఆవిష్కరణ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు దక్కించుకున్న అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల సరసన రామ్ చరణ్ చేరనుండటం గమనార్హం.


More Telugu News