ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ దెబ్బ.. స్టార్ బౌల‌ర్ దూరం!

  • మిచెల్ స్టార్క్ తిరిగి భార‌త్ వ‌చ్చేందుకు విముఖత‌
  • టోర్నీ తిరిగి ప్రారంభ‌మైనా స్టార్క్ ఇండియాకి తిరిగి రాకపోవచ్చని అతని మేనేజర్ వెల్ల‌డి
  • డీసీకి ఈ బౌల‌ర్ గైర్హాజ‌రు చిక్కులు తెచ్చిపెట్టే అవ‌కాశం
  • ఈసారి వేలంలో స్టార్క్‌ను రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ 
భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఐపీఎల్-2025 వారం వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే, ఇలా టోర్నీ అర్థాంత‌రంగా వాయిదా ప‌డ‌టం ప‌లు జ‌ట్ల‌కు శాపంగా మార‌నుంది. ఇప్ప‌టికే ఆర్‌సీబీ పేస‌ర్ హేజిల్‌వుడ్ దూర‌మ‌వుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా తాజాగా మ‌రో పేస‌ర్ దూరం కానున్న‌ట్లు స‌మాచారం. 

ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) బౌల‌ర్ మిచెల్ స్టార్క్ తిరిగి భార‌త్ వ‌చ్చేందుకు సుముఖంగా లేన‌ట్లు తెలుస్తోంది. టోర్నమెంట్ తిరిగి ప్రారంభమైనా స్టార్క్ ఇండియాకి తిరిగి రాకపోవచ్చునని అతని మేనేజర్ ఆస్ట్రేలియాకు చెందిన నైన్ న్యూస్‌తో అన్నారు. దీనిపై డీసీపై యాజమాన్యం స్పందించాల్సిన ఉంది. ఇప్ప‌టికే 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న డీసీకి ఈ బౌల‌ర్ గైర్హాజ‌రు చిక్కులు తెచ్చిపెట్టే అవ‌కాశం ఉంది. 

ఇక‌, ఐపీఎల్ సస్పెన్షన్ తర్వాత ఆస్ట్రేలియాలోని అగ్రశ్రేణి క్రికెటర్లు ఇప్ప‌టికే తమ తమ నగరాలకు చేరుకున్నారు. స్టార్క్, అతని భార్య అలిస్సా హీలీతో కలిసి సిడ్నీకి చేరుకున్నాడు. అయితే, అక్కడ ఈ విషయంపై స్థానిక మీడియాతో మాట్లాడటానికి ఆయన నిరాకరించాడు. కాగా, ఈసారి వేలంలో స్టార్క్‌ను ఢిల్లీ యాజ‌మాన్యం రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే.  

మ‌రోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) జట్టు కెప్టెన్‌ పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ కూడా జూన్ 11న లార్డ్స్‌లో జరిగే డ‌బ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధం కావడానికి ఆస్ట్రేలియాలోనే ఉండేందుకు మొగ్గుచూపే అవ‌కాశ ఉంద‌ని తెలుస్తోంది.

కాగా, ఐపీఎల్ మే 16 నాటికి తిరిగి ప్రారంభమవుతుందని, ఫైనల్ మే 25 నుంచి మే 30కి మార్చబడుతుందని బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఆదివారం ఎన్‌డీటీవీకి తెలిపాయి. 


More Telugu News