రోహిత్‌, కోహ్లీ 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌క‌పోవ‌చ్చు: సునీల్ గ‌వాస్క‌ర్‌

  • టెస్టు, టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన కోహ్లీ, రోహిత్‌
  • కేవ‌లం వ‌న్డే ఫార్మాట్‌లో కొన‌సాగేందుకు మొగ్గు
  • ఈ ద్వ‌యం వ‌చ్చే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడ‌టంపై స‌న్నీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
టీమిండియా స్టార్‌ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ ఇంగ్లాండ్ పర్యటనలో భార‌త జ‌ట్టు తరఫున వైట్ డ్రెస్‌లో ఆడటం ఖాయంగా కనిపించింది. ఈ టెస్టు సిరీస్‌లో ఆడి వారు ఈ లాంగ్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే అవ‌కాశం ఉంద‌ని అందరూ భావించారు. కానీ, సిరీస్ ప్రారంభం కావడానికి ముందే ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

ఇక‌, ఈ ద్వ‌యం ఇప్పటికే అంతర్జాతీయ టీ20 నుంచి రిటైర్ కావడంతో వారు భారత జెర్సీని ధరించే ఏకైక ఫార్మాట్ వన్డేలు మాత్ర‌మే. కోహ్లీ 2027 ప్రపంచ కప్ లో ఆడాలనే తన కోరికను బహిరంగంగా వ్యక్తం చేశాడు. అటు రోహిత్ కూడా 50 ఓవర్ల ప్రపంచ కప్ ఆడాల‌నే భావిస్తున్నాడు. అయితే, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం ఈ ఇద్ద‌రూ 2027 ప్రపంచ కప్ ఆడటం ఆచరణాత్మకంగా సాధ్యప‌డ‌క‌పోవ‌చ్చ‌ని తాజాగా అభిప్రాయ‌ప‌డ్డాడు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కూ ఆడ‌క‌పోవ‌చ్చ‌ని స‌న్నీ తెలిపాడు. 'స్పోర్ట్స్ టుడే'తో జరిగిన చాట్‌లో గవాస్కర్ మాట్లాడుతూ, వీరిద్దరి 2027 ప్రపంచ కప్ ప్రణాళికలు పూర్తిగా సెలెక్టర్లపై ఆధార‌ప‌డి ఉంటాయ‌ని అన్నాడు. వ‌చ్చే రెండేళ్లు ఈ ఫార్మాట్‌లో వారి ఆట బాగుంటే త‌ప్ప‌కుండా వచ్చే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపికయ్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాడు. 

"వ‌న్డే ఫార్మాట్‌లో వారిద్ద‌రూ దిగ్గ‌జాలు. మిగిలిన రెండు ఫార్మాట్ల‌కు వీడ్కోలు ప‌లికిన నేప‌థ్యంలో ప‌రిమిత సంఖ్య‌లో వ‌న్డేలు ఆడుతూ వారు 2027 వ‌ర‌కూ ఫామ్ కొన‌సాగించ‌గ‌ల‌రా అని న‌న్ను అడిగితే క‌ష్టం అనే చెబుతాను. ఈలోపు వ‌రుస సెంచ‌రీలు బాదితే అవ‌కాశం ఉండొచ్చేమో" అని లిటిల్ మాస్ట‌ర్ పేర్కొన్నాడు. 


More Telugu News