టెస్టుల‌కు కోహ్లీ రిటైర్మెంట్‌ ఆశ్చర్యానికి గురి చేసింది: జేమ్స్‌ అండ‌ర్స‌న్

  • టెస్ట్‌ ఫార్మాట్‌లో విరాట్ అద్భుత‌మైన బ్యాట‌ర్ అన్న‌ అండ‌ర్స‌న్
  • టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికిన అత‌ని స‌డెన్ నిర్ణ‌యం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని వ్యాఖ్య‌
  • స్టార్ ప్లేయ‌ర్లు రిటైరైనా ప్ర‌తిభావంతులైన‌ ఆటగాళ్లు టీమిండియాకు ఉన్నార‌న్న మాజీ పేస‌ర్‌
భార‌త జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ కొద్దిరోజుల వ్య‌వ‌ధిలోనే ఒక‌రి త‌ర్వాత ఒక‌రు టెస్టుల‌కు వీడ్కోలు ప‌ల‌క‌డం క్రికెట్ అభిమానుల‌కు ఒకింత షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి. అది కూడా కీల‌క‌మైన ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు ఈ ఇద్ద‌రు ఇలా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. ఇదే విష‌యమై తాజాగా ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అంద‌ర్స‌న్ స్పందించాడు. 

ముఖ్యంగా కోహ్లీ నిర్ణ‌యం తన‌కు ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌న్నాడు. లాంగ్ ఫార్మాట్‌లో విరాట్ అద్భుత‌మైన బ్యాట‌ర్ అని అండ‌ర్స‌న్ అన్నాడు. అయితే, అనుభ‌వ‌జ్ఞులైన ప్లేయ‌ర్లు రిటైర్మెంట్ ప్ర‌క‌టించినా వారి స్థానాన్ని భ‌ర్తీ చేయ‌గ‌ల అద్భుత‌మైన నైపుణ్యం ఉన్న ప్ర‌తిభావంతులైన‌ ఆటగాళ్లు టీమిండియాకు ఉన్నార‌ని తెలిపాడు. 

"రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన సార‌థి. టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లికాడు. కానీ, త్వ‌ర‌లోనే అత‌డి స్థానంలో ప్ర‌తిభావంతుడైన మ‌రో కెప్టెన్ వ‌స్తాడు. అలాగే విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట‌ర్‌. అత‌డి స్థానాన్ని కూడా భ‌ర్తీ చేయ‌డానికి భార‌త్‌లో చాలా మంది అద్భుత‌మైన టాలెంట్ ఉన్న ఆట‌గాళ్లున్నారు. అయితే, విరాట్ ఇలా స‌డెన్‌గా నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. 

భార‌త్‌లో ప్ర‌స్తుతం ఐపీఎల్ నుంచి టెస్ట్ క్రికెట్‌లోకి ప్లేయ‌ర్ల‌ను తీసుకు వ‌స్తున్నారు. అలా వ‌స్తున్న ఆట‌గాళ్లు నిర్భ‌యంగా, చాలా దూకుడుగా ఆడుతున్నారు. ఇక భార‌త జ‌ట్టులో అపార‌మైన ప్ర‌తిభ‌గ‌ల బ్యాట‌ర్లు, బౌల‌ర్ల‌కు కొద‌వ లేదు. అందుకే రాబోయే ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా నుంచి ఇంగ్లండ్ జ‌ట్టుకు క‌చ్చితంగా గ‌ట్టి స‌వాళ్లు ఎదురుకావ‌డం ఖాయం" అని అండ‌ర్స‌న్ చెప్పుకొచ్చాడు.       




More Telugu News