టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా ఎవరు సరిపోతారో తన అభిప్రాయాన్ని వెల్లడించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ

  • టెస్టు జట్టు కెప్టెన్‌గా బుమ్రా సరైనవాడన్న సిద్ధూ
  • జట్టును ఏకతాటిపై నడిపించే సత్తా బుమ్రాకు ఉందని వెల్లడి
  • విదేశాల్లో బుమ్రా ప్రదర్శనలే దీనికి నిదర్శనమన్న మాజీ క్రికెటర్
భారత టెస్టు క్రికెట్ జట్టుకు తదుపరి కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, టీమిండియా టెస్టు సారథ్య బాధ్యతలకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్ని విధాలా సరైన వ్యక్తి అని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో సిద్ధూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కొద్ది రోజుల క్రితం రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దరిమిలా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త టెస్టు కెప్టెన్ ఎంపికపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ, "ప్రస్తుతం భారత టెస్టు జట్టు కొన్ని క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. జట్టును సరైన మార్గంలో నడిపించాలంటే బలమైన నాయకుడు అవసరం. అదే సమయంలో, కెప్టెన్‌కు జట్టు సభ్యుల నుంచి పూర్తి మద్దతు కూడా ఉండాలి. గత ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించినప్పుడు ఏం జరిగిందో మనమంతా చూశాం. అయితే, ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది, అతనికి ఆమోదం లభిస్తోంది. కానీ, భారత జట్టును ఒక్కతాటిపై నడిపించగల సత్తా జస్ప్రీత్ బుమ్రాకు ఉందని నేను నమ్ముతున్నాను" అని తెలిపారు.

బుమ్రాకు తాను ఎందుకు మద్దతిస్తున్నానో వివరిస్తూ, "విదేశీ గడ్డపై బుమ్రా అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. అతని నిబద్ధత, ఆటతీరు ప్రశంసనీయం. నేను శుభ్‌మన్‌ గిల్‌కు వ్యతిరేకిని కాను. కానీ, అతను ప్రధానంగా బ్యాటర్. అతన్ని ఓపెనర్‌గా లేదా మూడో స్థానంలో ఆడించాలి. ఇక నాలుగో స్థానం కోసం సర్ఫరాజ్‌ ఖాన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి వారిని పరిశీలించవచ్చు. కరుణ్‌ నాయర్‌ కూడా ఒక ఆప్షన్. అయితే, ఆ స్థానానికి నా మొదటి ఎంపిక మాత్రం కేఎల్ రాహులే" అని సిద్ధూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. బుమ్రా నాయకత్వ పటిమ జట్టుకు మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 


More Telugu News