అందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది.. మ‌న‌వ‌రాళ్ల‌పై మోహ‌న్ బాబు ఆస‌క్తిక‌ర ట్వీట్‌

  • జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానున్న ‘కన్నప్ప’  
  • ఇప్పటికే జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు
  • ఈ మూవీ ద్వారా తెరంగేట్రం చేస్తున్న అరియానా, వివియానా
  • ఇప్పటికే వారి తాలూకు పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేసిన చిత్ర‌బృందం 
  • మే 28న శ్రీ కాళహస్తి స్థలపురాణాన్ని వివరించే లిరికల్ వీడియోను విడుదల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
మంచు మోహ‌న్ బాబు, మంచు విష్ణుల‌ డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిత్ర‌బృందం జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ టీజ‌ర్లు, ట్రైల‌ర్‌, పోస్ట‌ర్లు, పాట‌లు క‌న్న‌ప్పపై భారీ అంచ‌నాలు నెల‌కొల్పాయి. ఇక‌, ఈ మూవీ ద్వారా మోహ‌న్ బాబు మ‌న‌వ‌రాళ్లు, విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా కూడా తెరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. 

ఇప్పటికే వారి తాలూకు పోస్ట‌ర్ల‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. తాజాగా మోహ‌న్ బాబు ఈ ఇద్ద‌రు సిస్ట‌ర్ల గురించి మ‌రో ఆస‌క్తిక‌ర అప్‌డేట్‌ను ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ చిత్రంలో భాగంగా ఈ సోద‌రిమ‌ణులు శ్రీ కాళహస్తి స్థలపురాణాన్ని వివరించే లిరికల్ వీడియోను మే 28న విడుదల చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ మేర‌కు మోహ‌న్ బాబు ఆస‌క్తిక‌ర పోస్ట్‌ చేశారు. 

"శ్రీ కాళహస్తి స్థలపురాణాన్ని వివరించడానికి నా మనవరాలు అరియానా, వివియానా తమ గాత్రాన్ని అందించినందుకు నాకు గర్వకారణంగా ఉంది. కన్నప్ప నుంచి వారి శ్రీకాళహస్తి లిరికల్ వీడియో మే 28న విడుదల అవుతుంది. హర్ హర్ మహాదేవ్" అని మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు అరియానా, వివియానాకు సంబంధించిన మూవీలోని ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను కూడా జోడించారు.    

ఇక‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్ర‌లో కనిపించనున్నారు. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఇత‌ర‌ కీలక పాత్రలు పోషించారు.


More Telugu News