త్వరలోనే పహల్గామ్ కు వెళతా: కమలహాసన్

  • 'థగ్ లైఫ్' విడుదల వేళ.. కమల్ కీలక వ్యాఖ్యలు
  • ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు తగ్గించామని వెల్లడి
  • పహల్గామ్ కు వెళ్లి పర్యాటకులకు ధైర్యం చెబుతానన్న కమల్
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ తాజా చిత్రం 'థగ్ లైఫ్' విడుదలకు సిద్ధమవుతుతోంది. ఈ తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగానే తగ్గించామని కమలహాసన్ స్పష్టం చేశారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సంబరాలు చేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం 'థగ్ లైఫ్' సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్ పలు కీలక విషయాలను పంచుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శింబు, త్రిష వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా గురించి కమల్ మాట్లాడుతూ, " 'థగ్ లైఫ్' చిత్రాన్ని అనేక భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందించాం. చిత్ర బృందం మొత్తం ఎంతో కష్టపడి పనిచేసింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

అయితే, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్నందున, దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని కమల్ చెప్పారు. "ఇలాంటి సమయంలో మనం సినిమా వేడుకలు ఘనంగా జరుపుకోవడం సమంజసం కాదు. అందుకే మా సినిమా ఈవెంట్లను చాలా వరకు వాయిదా వేసుకున్నాం. ప్రస్తుతం అనుకున్న స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం లేదు" అని ఆయన వివరించారు.

త్వరలోనే తాను కశ్మీర్‌లోని పహల్గామ్ కు వెళతానని కమల్ హాసన్ ప్రకటించారు. "పహల్గామ్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం మనందరి బాధ్యత. అది కూడా నా దేశంలో అంతర్భాగమే. అక్కడికి వెళ్లి పర్యాటకులకు ధైర్యం చెప్పి, భరోసా కల్పిస్తాను. దేశంలోని అన్ని ప్రాంతాలు మనవే. ఎక్కడ ఏ ఆపద వచ్చినా స్పందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆ బాధ్యతతోనే నేను ఇప్పటివరకు నడుచుకుంటున్నాను" అని తెలిపారు. 'థగ్ లైఫ్' చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 


More Telugu News