హృతిక్ రోష‌న్‌తో హోంబలే ఫిల్మ్స్ ప్రాజెక్ట్‌.. క్రేజీ అప్‌డేట్ ఇదిగో!

  • హోంబలే ఫిలిమ్స్ నుంచి 'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలు
  • దీంతో పాన్ ఇండియా స్థాయిలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన వైనం
  • ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌తో క్రేజీ ప్రాజెక్ట్
'కేజీఎఫ్', 'కేజీఎఫ్-2', 'కాంతార', 'సలార్' వంటి భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన హోంబలే ఫిలిమ్స్... ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అధికారిక ప్రకటన వ‌చ్చింది. హోంబలే ఫిలిమ్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, హృతిక్‌కు ఘనంగా స్వాగతం పలికింది. 

"అతడిని గ్రీక్ గాడ్ అని పిలుస్తారు. అతను హృదయాలను పరిపాలించాడు, పరిమితులను బద్దలు కొట్టాడు. నిజంగానే ఆయన ఒక అద్భుతం! హృతిక్ రోషన్‌ను హోంబలే కుటుంబానికి స్వాగతించడానికి మేము గర్విస్తున్నాము. ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ కలయిక, ధైర్యం, గొప్పదనం, కీర్తి కథను విప్పబోతోంది. ఇంటెన్సిటీ ఊహలను కలిసే చోట, బిగ్ బ్యాంగ్ ప్రారంభమవుతుంది" అని త‌న పోస్టులో నిర్మాణ సంస్థ‌ రాసుకొచ్చింది. 

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు వెల్లడించ‌లేదు. దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాణ సంస్థ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక‌, హృతిక్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు హోంబలే ఫిలిమ్స్ కూడా ‘కాంతార: చాప్టర్ 1’, తార‌క్‌-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న‌ చిత్రాలతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.


More Telugu News